Revanth Reddy

Revanth Reddy: లంబాడా సోదరులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ వరాలు..!

Revanth Reddy: తెలంగాణలోని లంబాడా, గిరిజన సోదరుల విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు సామాజిక, రాజకీయ అభ్యున్నతికి తమ ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం (నవంబర్ 26, 2026) నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని మద్దిమడుగులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని పలు చారిత్రాత్మక ప్రకటనలు చేశారు.

గిరిజనుల అభివృద్ధి, హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ (ST Commission) ఏర్పాటు చేస్తామని, ఆ కమిషన్ ఛైర్మన్‌గా లంబాడా సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని నియమిస్తామని సీఎం ప్రకటించారు. అంతేకాకుండా, మద్దిమడుగులో జన్మించిన ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ దేవాలయాన్ని దేశానికే తలమానికంగా నిర్మిస్తామని, ప్రస్తుతం ఆలయానికి ఉన్న 16 ఎకరాలకు అదనంగా మరో 4 ఎకరాల భూమిని సేకరించి మొత్తం 20 ఎకరాల్లో ఆలయ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా సంత్ సేవాలాల్ మహారాజ్ సేవలను స్మరించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. మద్యం, మాంసానికి దూరంగా ఉంటూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలని సేవాలాల్ మహారాజ్ సమాజానికి సన్మార్గాన్ని చూపించారని కొనియాడారు. కొన్ని రాజకీయ పార్టీలు లంబాడా సామాజిక వర్గాన్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయని విమర్శించిన సీఎం, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మాత్రమే లంబాడాల పోరాట పటిమను గుర్తించి సమాన అవకాశాలు కల్పించారని గుర్తుచేశారు.

బ్రిటిష్ పాలకులను, నిజాం నవాబును ఎదిరించిన వీర చరిత్ర లంబాడా జాతికి ఉందని, నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న వారికి తండాల్లో ఆశ్రయం కల్పించిన ఘనత లంబాడాలదని ప్రశంసించారు. జైపాల్ రెడ్డి చొరవతో 1976లో ఇందిరాగాంధీ లంబాడాలను షెడ్యూల్డ్ తెగల (ST) జాబితాలో చేర్చడం వల్లే నేడు లంబాడా యువత ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత ఉద్యోగాలు, రాజకీయ పదవులు అధిరోహించగలిగారని తెలిపారు.

దున్నేవాడికే భూమి నినాదంతో ఇందిరాగాంధీ హయాంలో లంబాడా సోదరులకు 12 లక్షల ఎకరాల భూమి పంపిణీ జరిగిందని, అందుకే ప్రతి లంబాడా ఇంట్లో సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటం పక్కన ఇందిరాగాంధీ చిత్రపటం కనిపిస్తుందని అన్నారు.

తమ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పెద్దఎత్తున లబ్ధి చేకూరుతోందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో మంజూరు చేసిన 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో సుమారు 4 లక్షల ఇళ్లు ఎస్సీ, ఎస్టీ వర్గాలకే దక్కాయని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా 3.40 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు.

అచ్చంపేట, నల్లమల ప్రాంతం తన జన్మస్థలమని, ఈ గడ్డ బిడ్డగా చెప్పుకోవడం తనకు ఎంతో గర్వకారణమని సీఎం భావోద్వేగంతో అన్నారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణను గెలిపిస్తే అచ్చంపేటకు ఇద్దరు ఎమ్మెల్యేల అండ ఉంటుందని తాను ఇచ్చిన మాట ప్రకారం, నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే రూ.450 కోట్ల నిధులు తీసుకొచ్చామని వెల్లడించారు. రాజకీయాల్లో లంబాడాలకు రావాల్సిన సరైన ప్రాతినిధ్యం కోసం తాను ఢిల్లీ వరకు వెళ్లి పోరాడతానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *