Mahesh Goud: తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలపై చేసిన వ్యాఖ్యలతో పాటు, పార్టీ నేతల అసమ్మతి స్వరాలపై తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి బహిరంగ ప్రకటనలు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ లక్ష్మణరేఖ దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
నేనే ఎమ్మెల్యే అభ్యర్థి అంటే కుదరదు
పరకాల టికెట్‌పై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు..
-
విధానపరమైన సీట్ల కేటాయింపు: ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే ఎవరికి వారు తామే ఎమ్మెల్యే అభ్యర్థులమని స్వయంగా ప్రకటించుకోవడం సరికాదు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపునకు అధిష్ఠానం రూపొందించిన ఒక స్పష్టమైన విధానం ఉంది. పీసీసీ అధ్యక్షుడితో సహా ప్రతి ఒక్కరూ ఆ నియమావళికి కట్టుబడి ఉండాల్సిందే.
-
వివరణ కోరాం – క్రమశిక్షణ చర్యలు: కొండా సుస్మిత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖను, అలాగే మరో వివాదంపై సీనియర్ నేత చిన్నారెడ్డిని ఇప్పటికే వివరణ కోరామని వెల్లడించారు. వారిచ్చే వివరణ ఆధారంగా పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు.
-
అచ్చా.. పచ్చ కాంగ్రెస్ అంటూ ఏమీ లేదు: పార్టీలో పాత, కొత్త నేతల కలయికతోనే కాంగ్రెస్ మరింత బలోపేతమైందని, బీసీలు, మైనార్టీలు, అణగారిన వర్గాలకు కాంగ్రెస్‌లోనే సముచిత గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు.
22A పై బీఆర్‌ఎస్ అనవసర రాద్ధాంతం
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల నిషేధిత జాబితా (సెక్షన్ 22A) వివాదంపై పీసీసీ చీఫ్ స్పష్టత ఇచ్చారు:
-
సరిదిద్దిన ప్రభుత్వం: 22A జాబితాలో కొన్ని ప్రైవేటు ఆస్తులు చేరడం క్షేత్రస్థాయిలో జరిగిన పొరపాటని, ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు.
-
భూదందాలకు చెక్: 22A నిబంధనలు ప్రభుత్వ భూముల అన్యాక్రాంతాన్ని, భూదందాలను అడ్డుకోవడానికేనని స్పష్టం చేశారు. సామాన్యులకు ఎలాంటి అన్యాయం జరగదని, ఏమైనా సమస్యలుంటే గాంధీ భవన్ తలుపులు తట్టవచ్చని భరోసా ఇచ్చారు.
-
పోచారం ఆవేదన అర్థం చేసుకున్నాం: సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి ఇటీవల వ్యక్తం చేసిన ఆవేదనపై ఇప్పటికే ఆయనతో మాట్లాడామని, బాన్సువాడలో పాత-కొత్త నేతలందరినీ కలుపుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. రాబోయే నామినేటెడ్ పోస్టుల్లో పార్టీ కోసం పనిచేసిన సీనియర్ కార్యకర్తలకు 70 శాతం ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు.
పార్టీలో విభేదాలు పక్కనపెట్టి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
