Vizag Steel Plant: విశాఖ ఉక్కు కర్మాగారం (Visakhapatnam Steel Plant)లో ఒకే రోజు రెండు విభిన్న విభాగాలో జరిగిన ఘోర ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. స్టీల్ మెల్ట్ షాప్-1 (SMS-1) విభాగంలో జరిగిన లాడిల్ పేలుడు కారణంగా కనీసం 8 మంది కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటన జరగడానికి సరిగ్గా అరగంట ముందే ఎస్ఎమ్ఎస్-2 (SMS-2) విభాగంలోనూ మరో ప్రమాదం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఒకే రోజు రెండు చోట్ల ప్రమాదాలు జరగడంతో కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
ముఖ్యమంత్రి ఆదేశం – ప్రధాని మోదీ పరిహారం.
ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులైన ఆరుగురు కార్మికులకు అత్యుత్తమ, కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMRF) నుంచి బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు.మృతుల కుటుంబాలకు పీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది మరోవైపు తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున తక్షణ సాయం.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి కుమారస్వామి.
ప్రమాద సమాచారం అందిన వెంటనే కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి విశాఖపట్నం చేరుకుని ప్లాంట్‌లోని ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించి, కేంద్ర ప్రభుత్వం తరఫున చారిత్రాత్మకమైన సహాయక ప్యాకేజీని ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది. బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం ఒక ‘ప్రత్యేక విచారణ కమిటీ’ని ఏర్పాటు చేస్తున్నాం. ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలపై కార్మికులు భయపడాల్సిన అవసరం లేదు అంటూ హెచ్.డి. కుమారస్వామి అన్నారు.
కేంద్రమంత్రి ప్రకటించిన చారిత్రాత్మక ప్యాకేజీ వివరాలు:
కేంద్రమంత్రి కుమారస్వామి రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా సమాన న్యాయం చేస్తూ సంచలన నిర్ణయాలు ప్రకటించారు:
ప్రమాదంలో మరణించిన 8 మంది కార్మికుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున, అలాగే గాయపడిన వారికి రూ. 10 లక్షల చొప్పున భారీ పరిహారం అందజేస్తారు. (ఈ పరిహారం కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు కూడా సమానంగా వర్తిస్తుంది).
మృతుల కుటుంబంలో ఒకరికి స్టీల్ ప్లాంట్‌లో శాశ్వత (Permanent) ఉద్యోగం కల్పిస్తారు. కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలకు సైతం ఈ ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.ప్రమాదానికి గురైన బాధితుల పిల్లలందరికీ పూర్తి ఉచిత విద్య (Free Education) అందిస్తామని హామీ ఇచ్చారు. బాధితులు ప్రస్తుతం నివసిస్తున్న స్టీల్ ప్లాంట్ క్వార్టర్లలోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తులోనూ కొనసాగేందుకు యాజమాన్యం అనుమతి ఇస్తుందని తెలిపారు.
