Indira Mahila Shakti

Indira Mahila Shakti: మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు.. నేడు పరేడ్ గ్రౌండ్స్‌లో 553 బస్సులను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!

Indira Mahila Shakti: తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకు వేసింది. ‘ఇందిరా మహిళా శక్తి’ పథకంలో భాగంగా స్వయం సహాయక మహిళా సంఘాలకు (SHGs) ఆర్టీసీ బస్సులను కేటాయించే బృహత్తర కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం సాయంత్రం నిర్వహించబోయే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘మహిళాశక్తి సభ’లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పాల్గొని, మహిళా సంఘాలకు 553 ఆర్టీసీ బస్సులను అధికారికంగా అందజేయనున్నారు.

199 కోట్ల ఆర్థిక సాయం.. మరో 400 కొత్త బస్సులు.

మహిళా సంఘాలను వ్యాపారవేత్తలుగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది.ఈ పథకం కింద కొత్త బస్సుల కొనుగోలుకు గానూ రవాణా శాఖ (TG-RTC) తరఫున రూ. 199 కోట్ల భారీ ఆర్థిక సహాయాన్ని అందించారు.ప్రస్తుతం అందజేస్తున్న 553 బస్సులతో పాటు, రాబోయే రోజుల్లో మహిళా సంఘాల నిర్వహణ కోసం మరో 400 కొత్త బస్సులను కూడా కేటాయించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

రూ. 500 కోట్ల వడ్డీ లేని రుణాలు.

ఈ సభ కేవలం బస్సుల కేటాయింపునకే పరిమితం కాకుండా, మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి మరో వరంగా మారనుంది. మహిళలు వివిధ రకాల స్వయం ఉపాధి రంగాలలో రాణించేందుకు వీలుగా.. ఏకంగా రూ. 500 కోట్ల విలువైన వడ్డీ లేని రుణాల (Interest-Free Loans) చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సంఘాల ప్రతినిధులకు స్వయంగా పంపిణీ చేయనున్నారు.

సాయంత్రం 5 గంటలకు ‘మహిళాశక్తి సభ’కు సీఎం.

ఈరోజు సాయంత్రం 5:00 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ మహాసభకు హాజరవుతారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది మహిళా సంఘాల సభ్యులు తరలిరానున్నారు. బస్సుల పంపిణీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మహిళలనుద్దేశించి ప్రసంగించనున్నారు. మహిళల రవాణా, ఉపాధి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికే ఈ ‘ఇందిరా మహిళా శక్తి’ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని మంత్రులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *