Vijaysai Reddy

Vijaysai Reddy: యువతలో ఒకరినే సీఎం చేస్తా.. రెడ్ల పౌరుషాన్ని కాపాడుతాం!

Vijaysai Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్న మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి అనంతపురం వేదికగా తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము త్వరలోనే స్థాపించబోయే నూతన రాజకీయ పార్టీ తెలుగుదేశం (TDP), వైఎస్సార్ కాంగ్రెస్ (YSRCP) పార్టీలకు బలమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ప్రకటించారు. శుక్రవారం అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాయలసీమ ప్రాంత అభివృద్ధి, స్థానిక ప్రజల ఆత్మగౌరవ పరిరక్షణే తమ పార్టీ ప్రధాన అజెండా అని తేల్చిచెప్పారు. తమ పార్టీ రాయలసీమ ఒరిజినల్ రెడ్ల పౌరుషాన్ని కాపాడుతుందని, అదే సమయంలో అన్ని కులాలు, మతాలను సమానంగా గౌరవిస్తుందని స్పష్టం చేశారు.

రెండు కుటుంబాల పాలన వల్లే సీమ నాశనం

రాష్ట్ర విభజన తర్వాత పాలించిన ఇద్దరు ముఖ్యమంత్రులు రాయలసీమ ప్రాంతానికి చెందినవారే అయినప్పటికీ, సీమకు ఒనగూరిన ప్రయోజనం శూన్యమని మండిపడ్డారు. నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబాలు రాష్ట్రాన్ని దశాబ్దాలుగా ఏలుతున్నాయని, ఈ రెండు కుటుంబాలు అధికారంలో ఉన్నంత కాలం రాయలసీమ అభివృద్ధి చెందదని విమర్శించారు.
12 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టయినా పూర్తి చేశారా?
గత 12 ఏళ్ల కాలంలో సీమలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. సీమలో పుట్టిన ఈ నాయకులు ఇతర ప్రాంతాల్లో స్థిరపడి, ఎన్నికల వేళ ఓట్ల కోసమే రాయలసీమను, రెడ్లను వాడుకుంటున్నారని ఆరోపించారు.
కార్పొరేషన్ భర్తీపై నిలదీత..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంత కాలమైనా ఇప్పటివరకు రెడ్డి కార్పొరేషన్‌ను ఎందుకు ఏర్పాటు చేయలేదని, అందులోని ఖాళీలను ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులకు పూర్తి న్యాయం చేస్తూనే.. రెడ్ల ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యతను తమ నూతన పార్టీ తీసుకుంటుందని తెలిపారు.
నేను సీఎం రేసులో ఉండను – యువతలో ఒకరికే అవకాశం..
రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయ ముఖచిత్రంపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. “టీడీపీకి ఓటు వేస్తే 2029లో నారా లోకేష్ సీఎం అవుతారు. వైసీపీకి ఓటేస్తే మళ్లీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. కానీ మా పార్టీకి ఓటు వేస్తే.. రాయలసీమ యువతరంలో సమర్థుడైన ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తాం” అని ప్రకటించారు. తాను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి పోటీలో ఉండబోనని, నవతరం నాయకత్వాన్ని ప్రోత్సహించడమే తన సంకల్పమని వెల్లడించారు.
రాయలసీమను ‘రతనాల సీమ’గా మారుస్తాం..
రాష్ట్రంలో అత్యధికంగా ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నది రాయలసీమ నుంచే కావడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ సమస్యలు మాత్రం అలాగే ఉండిపోతున్నాయన్నారు.

యువత ఏ ఒక్క వ్యక్తి కోసమో కాకుండా.. తమను కన్న పుట్టినగడ్డ కోసం, రాష్ట్ర, దేశాభివృద్ధి కోసం పోరాడాలని, రక్తం చిందించాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, రాయలసీమను పూర్వవైభవంతో కూడిన నిజమైన ‘రతనాల సీమ’గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *