Train Trailer Release: విలక్షణ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో, విభిన్న చిత్రాల దర్శకుడు మిస్కిన్ (Mysskin) తెరకెక్కించిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ట్రైన్’ (Train). డిసెంబర్ 4, 2026న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో, మూవీ టీమ్ తాజాగా అధికారిక ట్రైలర్‌ను విడుదల చేసింది. “హై-ఆక్టేన్ యాక్షన్‌ను చూడటానికి సిద్ధంగా ఉండండి.. ఇదే మా #Train ట్రైలర్” అంటూ విజయ్ సేతుపతి సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
ట్రైలర్ ఎలా ఉందంటే..
ఒక రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన సూపర్‌ఫాస్ట్ రైలులో జరిగే ఊహించని, భయానక పరిణామాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. రైలు వేగంగా దూసుకెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో ఒక్కసారిగా పెను ప్రమాదం ముంచుకొస్తుంది. ఒకవైపు అదుపు తప్పిన రైలును ఆపడానికి రైల్వే అధికారులు సమయంతో పోటీ పడుతూ శ్రమిస్తుంటే, మరోవైపు అదే రైలులో ఒక రహస్య కుట్రకు పాల్పడుతున్న సాయుధ దుండగుల ముఠా ప్రయాణికులను బందీలుగా పట్టుకోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది.
చుట్టూ ఉన్న ప్రయాణికులంతా భయంతో వణికిపోతుంటే, అదే రైలులో ప్రయాణిస్తున్న విజయ్ సేతుపతి మాత్రం ఎంతో ప్రశాంతంగా, వ్యూహాత్మకంగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటూ వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను ఎలా కాపాడాడు అనేది ట్రైలర్లో గూస్బంప్స్ తెప్పించేలా చూపించారు.
ఇక సీనియర్ నటుడు నాజర్ (Nasser) ఈ సినిమాలో మిస్టరీతో కూడిన పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. ట్రైలర్లో ఆయన చెప్పే “అందరినీ వెతకండి, డిలీట్ చేయండి (Find them all, delete!)” అనే డైలాగ్ సస్పెన్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నాజర్లతో పాటు శ్రుతి హాసన్, నరైన్, యుగి సేతు, కె.ఎస్. రవికుమార్, సంపత్ రాజ్, కలైయరసన్, ఇరా దయానంద్, ప్రీతి కరణ్ మరియు బిగ్‌బాస్ ఫేమ్ త్రిగుణ్ కీలక పాత్రల్లో నటించారు.
2020లో వచ్చిన ‘సైకో’ తర్వాత మిస్కిన్ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఈ మూవీపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు కథ, దర్శకత్వంతో పాటు సంగీతాన్ని కూడా మిస్కిన్ స్వయంగా అందించడం విశేషం కాగా, ఫౌజియా ఫాతిమా సినిమాటోగ్రఫీ అందించారు. వి క్రియేషన్స్ (V Creations) పతాకంపై ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్. థాను నిర్మించిన ఈ చిత్రం, ఇప్పటికే సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ (U/A) సర్టిఫికెట్ పొంది డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రావడానికి సర్వం సిద్ధం చేసుకుంది.

