Salzburg Festival 2026: తెలుగు పాటకు, మన సంకీర్తనా సాహిత్యానికి ఖండాంతరాల్లో ఉన్న ఆదరణ మరోసారి ప్రపంచానికి చాటిచెప్పబడింది! శతాబ్దాల క్రితం పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన అమర గీతం ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే’ ఇప్పుడు అంతర్జాతీయ సంగీత వేదికపై మార్మోగింది.
ప్రతిష్టాత్మక 2026 సోల్స్‌బర్గ్ ఫెస్టివల్ (Salzburg Festival) వేదికగా గ్రామీ అవార్డు విజేత, ప్రముఖ అకాపెల్లా (A Cappella) గాయక బృందం ‘చాంటిక్లియర్’ (Chanticleer) ఈ తెలుగు కీర్తనను అత్యద్భుతంగా ఆలపించింది. విదేశీ గాయకుల గొంతుల్లో స్పష్టమైన తెలుగు ఉచ్చారణతో మన అన్నమయ్య కీర్తన వినిపించడంతో, ఆ ప్రదర్శనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ప్రతి తెలుగువాడి గుండెను గర్వంతో నింపుతోంది.
ఈ ప్రదర్శనలో అత్యంత ఆకట్టుకునే ప్రత్యేకత ఏంటంటే.. ఈ కీర్తనను సాధారణంగా మనం వినే సంప్రదాయ కర్ణాటక సంగీత శైలిలో కాకుండా, పాశ్చాత్య ‘అకాపెల్లా’ (A Cappella) సంగీత పద్ధతిలో ఆలపించారు. అంటే, వెనుక తబలా, మృదంగం, గిటార్ లేదా మరే ఇతర సంగీత వాయిద్యాల తోడ్పాటు లేకుండా.. కేవలం గాయకుల గొంతులతోనే విభిన్న స్వరాలను (Harmony) పలికిస్తూ ఈ బృందం అద్భుతం సృష్టించింది. ఒకరి స్వరానికి మరొకరి స్వరం తోడవుతూ, భక్తి భావం ఏమాత్రం చెదరకుండా సాగిన ఈ ప్రదర్శన వినేవారికి ఒక సరికొత్త దివ్యానుభూతిని కలిగిస్తోంది.
ఈ అపురూప ప్రదర్శన వెనుక వినీల్ గరిసా మహల్ (Vineel Garisa Mahal) అనే భారతీయ మూలాలున్న గాయకుడి కృషి ఉంది. చాంటిక్లియర్ బృందంలో టెనర్ (Tenor) సింగర్‌గా కొనసాగుతున్న వినీల్, ఆ ప్రతిష్టాత్మక బృందంలో చోటు దక్కించుకున్న తొలి భారతీయ మూలాలున్న గాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు.
చిన్నతనంలో తన తల్లిదండ్రులతో కలిసి కారులో ప్రయాణిస్తున్నప్పుడు వినిపించే భారతీయ కీర్తనలు, భక్తి గీతాలే తన సంగీత ప్రయాణానికి బలమైన పునాది వేశాయని ఆయన గుర్తుచేసుకున్నారు. తన బాల్య స్మృతుల్లోని అన్నమయ్య కీర్తనను అంతర్జాతీయ వేదికపై తన బృందంతో కలిసి పాడటం ఎంతో ఆనందంగా ఉందని వినీల్ పేర్కొన్నారు.
నిజానికి ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే’ కీర్తనకు ఉన్న విశిష్టతే వేరు. అన్నమాచార్యులు రచించిన ఈ కీర్తనలో భగవంతుడు ఒక్కడే అనే లోతైన ఆధ్యాత్మిక భావనతో పాటు, మనుషులందరూ సమానమే అనే గొప్ప సామాజిక సందేశం దాగి ఉంది. కులం, మతం, హోదా, పేద-ధనిక వంటి తేడాలు మనుషుల మధ్య ఎన్ని ఉన్నా.. అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మ ఒక్కటే అనే సార్వజనీన సత్యాన్ని ఈ కీర్తన వివరిస్తుంది.
అందుకే ఇన్ని శతాబ్దాలు గడిచినా ఈ కీర్తనకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. గతంలో ‘అన్నమయ్య’ చిత్రంలో ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకత్వంలో ఈ కీర్తన మరింతగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది. ఇప్పుడు విదేశీ గాయక బృందం కూడా అదే కీర్తనను తమదైన శైలిలో ఆలపించడం మన తెలుగు సంగీత వారసత్వానికి దక్కిన మరో అరుదైన గౌరవంగా నిలిచింది.
విదేశీ గళాల్లో అన్నమయ్య సంకీర్తన.. అద్భుతం!.
స్విట్జర్లాండ్‌లో జరిగిన సోల్స్‌బర్గ్ ఫెస్టివల్–2026లో ప్రముఖ గాయక బృందం ‘చాంటిక్లీర్’ ఆలపించిన అన్నమయ్య సంకీర్తన ‘బ్రహ్మమొక్కటే.. పరబ్రహ్మమొక్కటే’.
పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన ఈ సంకీర్తన విదేశీ గాయకుల గళాల్లో వినిపించడం ప్రతి తెలుగు వారికీ గర్వకారణం.
భాషలు, దేశాలు వేరైనా భక్తికి ఎల్లలు లేవు!
#Annamacharya #BrahmamOkkate #TeluguCulture #IndianMusic
— Telugu Stride (@TeluguStride) November 28, 2026
