Tamil Nadu: తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం రేపు అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోనుంది. ఇప్పటికే చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్, బుధవారం జరిగే ఫ్లోర్ టెస్ట్ కోసం సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం విజయ్‌కు 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయితే, మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఒక ఉత్తర్వుతో ఈ బలంపై చిన్న ప్రభావం పడింది. ఒక్క ఓటుతో గెలిచిన ఒక టీవీకే ఎమ్మెల్యేను బలపరీక్షలో పాల్గొనవద్దని కోర్టు ఆదేశించడంతో, విజయ్ బలం 119కి తగ్గింది. అయినప్పటికీ, ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే విజయ్ బలం ఎక్కువే ఉండటం గమనార్హం.
ఇలాంటి ఉత్కంఠ భరిత సమయంలో తమిళనాడు ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే (AIADMK)లో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. పార్టీ అధినేత పళనిస్వామిపై అసంతృప్తితో ఉన్న దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. సీనియర్ నేత షణ్ముగం నేతృత్వంలో ఈ ఎమ్మెల్యేలంతా విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీంతో అన్నాడీఎంకేలో ఒక్కసారిగా చీలిక ఏర్పడి, ఆ పార్టీ బలహీనపడినట్లయింది.
ఫ్లోర్ టెస్ట్‌కు సరిగ్గా ఒకరోజు ముందు ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి విజయ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తిరుగుబాటు నేతలు షణ్ముగం, ఎస్.పి. వేలుమణిలతో విజయ్ ప్రత్యేకంగా చర్చలు జరిపారు. రేపటి బలపరీక్షలో అనుసరించాల్సిన వ్యూహాలపై వీరు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ 30 మంది ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ బలం ఇప్పుడు 150కి పైగా పెరిగింది. దీంతో రేపటి బలపరీక్ష కేవలం ఒక ఫార్మాలిటీగా మాత్రమే మిగిలిపోనుంది. మొత్తానికి తమిళనాడులో టీవీకే ఇక తిరుగులేని శక్తిగా అవతరించబోతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
