Bandi Bhageerath

Bandi Bhageerath: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు పోలీసుల నోటీసులు

Bandi Bhageerath: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇటీవల నమోదైన ఒక పోక్సో (POCSO) కేసులో విచారణకు హాజరుకావాలంటూ హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. బుధవారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు కరీంనగర్‌లోని భగీరథ్ నివాసానికి వెళ్లగా, అక్కడ కుటుంబ సభ్యులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఫోన్ ద్వారా సమాచారం అందించారు.

ఈ వివాదం ఒక మైనర్ బాలికకు సంబంధించిన ఫిర్యాదుతో మొదలైంది. తన 17 ఏళ్ల కుమార్తెను భగీరథ్ వేధిస్తున్నాడంటూ సదరు బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. భగీరథ్‌పై పోక్సో చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆడపిల్లల రక్షణకు సంబంధించిన కఠినమైన చట్టాలు ఇందులో ఉండటంతో ఈ కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అయితే, ఈ వ్యవహారంలో మరో కోణం కూడా వెలుగులోకి వచ్చింది. సదరు బాలిక మరియు ఆమె తల్లిదండ్రులు తనను డబ్బుల కోసం బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ భగీరథ్ కూడా ఎదురు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో, అసలు నిజానిజాలు ఏమిటన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *