Venu swamy: పుష్ప 2 చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి బుధవారం శ్రీతేజ్‌ను పరామర్శించి, అతడి ఆరోగ్య పరిస్థితిని ఆయన తండ్రి భాస్కర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో భాస్కర్ కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని చెక్కుగా అందజేశారు.
వేణు స్వామి మాట్లాడుతూ, శ్రీతేజ్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ తన ఖర్చులతో వచ్చే వారం రోజుల్లో మృత్యుంజయ హోమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. శ్రీతేజ్ పూర్తిగా కోలుకుంటాడనే నమ్మకం ఉందని, ఆయన సోదరికి ఆర్థిక సహాయం అందించడం తన కర్తవ్యంగా భావించానని తెలిపారు.
ఈ సంఘటనపై వేణు స్వామి, పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ జాతకంలో శని ప్రభావం కారణంగా ఇది జరిగినదని అన్నారు. అల్లు అర్జున్ జాతక ప్రభావం వచ్చే ఏడాది మార్చి 29 వరకు ఇలానే ఉండే అవకాశం ఉందని, ఈ సమయంలో ఆయన కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
టాలీవుడ్‌లో చాలా సినిమాలకు ముహూర్తాలు పెట్టిన అనుభవం తనకుందని గుర్తు చేస్తూ, శ్రీతేజ్ కుటుంబానికి సాయం చేయడం తన బాధ్యతగా భావించానని తెలిపారు.