US Elections 2024: అమెరికాలో ఎన్నికల హడావుడి మామూలుగా లేదు. చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ప్రచారం హోరెత్తుతోంది అక్కడి జనాలు చెబుతున్నారు. అక్కడ మన దేశంలో లా బోలెడు పార్టీలు లేవు. ఉన్నా అవి పోటీలో నిలబడి మనలేవు. రెండే రెండు పార్టీలు అక్కడి రాజకీయాలను.. అధికారాన్ని శాసిస్తూ ఉంటాయి. ఒకటి డెమాక్రాటిక్, రెండు రిపబ్లిక్. ఈ రెండు పార్టీల మధ్యే అధికార మార్పిడి జరుగుతుంది. అదీ ప్రజాస్వామ్య బద్ధంగా.
అన్నట్టు.. ప్రజాస్వామ్యం అంటే గుర్తొచ్చింది. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు తప్పనిసరి కదా. అలాగే, అమెరికాలోనూ ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు అదే హడావుడి. రెండు పార్టీలు ప్రధానంగా పోటీలో ఉంటాయని చెప్పుకున్నాం కదా. వాటిని రిప్రజెంట్ చేసే రెండు జంతువుల గురించి ఇపుడు చెప్పుకుందాం. అవును.. గాడిద, ఏనుగు.. అమెరికాలోని రెండు ప్రధాన పార్టీల గుర్తింపు చిహ్నాలు. డెమాక్రాటిక్స్ అంటే కమలా హారిస్ పోటీచేస్తున్న పార్టీకి గాడిద.. రిపబ్లిక్ పార్టీ అంటే డోనాల్డ్ ట్రంప్ పార్టీకి ఏనుగు శతాబ్దాలుగా గుర్తులుగా వెలిగిపోతున్నాయి. అసలు ఈ పార్టీలకు ఆ ఏనుగు, గాడిద గుర్తింపుగా ఎలా మారాయి.. ఆ కథలు తెలుసుకుందాం రండి.
ఇది కూడా చదవండి: US Bans Indian Companies: భారతీయ కంపెనీలపై అమెరికా నిషేధం
గాడిదతో మామూలుగా ఉండదు!
US Elections 2024: అది 1828వ సంవత్సరం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నుంచి ఆండ్రూ జాక్సన్ అభ్యర్థిగా నిలిచారు. అతని పోటీ విగ్ పార్టీకి చెందిన జాన్ ఆడమ్స్‌తో హోరాహోరీగా ఉంది. ఎన్నికల్లో గెలవడానికి, జాక్సన్ తన ప్రచారంలో ఆడమ్స్ ను ఎగతాళి చేశాడు. అతని వాగ్ధానాలను వ్యంగ్యంగా కెలికాడు. దీంతో ఆడమ్స్ కు ఒళ్ళు మండింది. మరి ఒళ్ళు మండితే ఎవరైనా ఊరుకోరు కదా.. అందులోనూ రాజకీయ నాయకులు. దీంతో ఆడమ్స్.. జాక్సన్ పేరును ఎగతాళి చేస్తూ ప్రచారం మొదలు పెట్టాడు. జాకాస్ అంటే గాడిద. అని జాక్సన్ ను పిలవడం మొదలెట్టాడు.
మరోవైపు జాక్సన్ కూడా తక్కువ తినలేదు. తన పేరును ఎగతాళి చేయడమే ఛాలెంజ్ గా తీసుకున్నాడు. అదే జాకాస్ అంటే గాడిదను తన గుర్తుగా మార్చుకుని.. పోస్టర్స్ వేయించి ప్రచారం దంచి కొట్టాడు. అంతే.. ఆడమ్స్ కి చుక్కలు కనిపించాయి. జాక్సన్ అధ్యక్షుడిగా గెలిచారు. గాడిద గుర్తే తమను గెలిపించింది డెమాక్రాట్లు బాగా ఫిక్స్ అయిపోయారు. అప్పటి నుంచీ గాడిద డెమాక్రాట్స్ అధికారిక చిహ్నంగా మారిపోయింది. అదీ విషయం.
ఇది కూడా చదవండి: Gold rate: షాకిస్తున్న బంగారం.. రోజు రోజుకు పై పైకి
రిపబ్లికన్స్ ఏనుగు కథ..
US Elections 2024: ఇప్పుడు 1860కి వెళదాం. ఇది అమెరికాలో ఎన్నికల సంవత్సరం. ఇల్లినాయిస్ రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అబ్రహం లింకన్ ఆధిక్యంలో ఉన్నారు. లింకన్ దృష్టిని ఆకట్టుకోవడానికి అప్పటి వార్తా పత్రికలు రిపబ్లికన్ పార్టీ వార్తల్లో ఏనుగు ఫోటోను వాడడం మొదలు పెట్టాయి. వాటి ఉద్దేశ్యం లింకన్ ఏనుగు లాంటి వాడు అని కావచ్చు. అయితే, ఈ ప్రచారం రిపబ్లికన్ పార్టీకి బాగా కలిసి వచ్చింది. దీంతో అప్పటి నుంచి రిపబ్లికన్ పార్టీ అంటే ఏనుగు అనే గుర్తు స్థిరపడిపోయింది.
అయితే డెమోక్రటిక్ పార్టీని గాడిదగా, రిపబ్లికన్ పార్టీని ఏనుగుగా గుర్తించడంలో అమెరికాకు చెందిన ప్రముఖ కార్టూనిస్ట్ థామస్ నెస్ట్ అత్యంత కీలక పాత్ర పోషించారు.
అతను 1870లలో డెమోక్రటిక్ పార్టీ కోసం గాడిద – రిపబ్లికన్ పార్టీ కోసం ఏనుగు యొక్క కార్టూన్లను విస్తృతంగా ఉపయోగించాడు. ఫలితంగా రెండు పార్టీలు గాడిద – ఏనుగులను తమ శాశ్వత గుర్తింపుగా మార్చుకున్నాయి. ఇది ఇప్పటివరకు కొనసాగుతోంది.
అదండీ, అమెరికాలో ఏనుగు.. గాడిదల కథ. విషయం ఏమిటంటే.. ఎన్నికలు అంటే మన దేశంలోనే వికృత ప్రచారాలు ఉంటాయి అని అనుకుంటాం కానీ, ఎప్పుడో 18వ శతాబ్దంలోనే ఇలాంటి పోకడలు ఉన్నాయనే విషయం మాత్రం నిజం.