Donald Trump

Donald Trump: హెచ్-1బీ వీసాలపై $1,00,000 భారీ ఫీజును కొట్టేసిన యూఎస్ కోర్టు..!

Donald Trump: అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ రంగానికి యూఎస్ ఫెడరల్ కోర్టు భారీ ఊరటనిచ్చింది. కొత్త హెచ్-1బీ (H-1B) వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 1,00,000 డాలర్ల (సుమారు రూ. 83 లక్షలకు పైగా) భారీ ఫీజును కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పు అమెరికాలోని ప్రముఖ వ్యాపార సంస్థలు, విశ్వవిద్యాలయాలు మరియు వేలాది మంది విదేశీ నిపుణులకు గొప్ప విజయంగా నిలిచింది. హెచ్-1బీ వీసాదారులలో సింహభాగం భారతీయులే ఉన్నందున, ఈ నిర్ణయం మన దేశీయులకు అత్యంత కీలకమైనదిగా మారింది.

కాంగ్రెస్ అనుమతి లేకుండా ఫీజు చెల్లదు: కోర్టు స్పష్టీకరణ

యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లియో సోరోకిన్ ఈ కేసులో సోమవారం నాడు కీలక తీర్పును వెలువరించారు.అమెరికా పార్లమెంట్ (కాంగ్రెస్) ఆమోదం లేకుండా వీసాలపై ఇంత భారీ మొత్తంలో ఫీజులను ఏకపక్షంగా విధించే అధికారం అధ్యక్షుడు ట్రంప్‌కు లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ట్రంప్ పరిపాలనా యంత్రాంగం తీసుకొచ్చిన ఈ నిబంధనను పూర్తిగా చట్టవిరుద్ధమని ప్రకటిస్తూ, దీనిని తక్షణమే రద్దు (Invalidated) చేయాలని కోర్టు ఆదేశించింది.

ట్రంప్ వీసా ఆంక్షలు – అసలు వివాదం ఏమిటి?

వలసలపై కఠినమైన ఆంక్షలు విధించే వ్యూహంలో భాగంగా ట్రంప్ గతేడాది సెప్టెంబర్‌లో ఈ $1,00,000 భారీ ఫీజును ప్రకటించారు. విదేశీ కార్మికులపై అమెరికన్ కంపెనీలు ఆధారపడటాన్ని తగ్గించడం  స్థానిక అమెరికన్లకే ఉద్యోగ అవకాశాలు దక్కేలా ప్రోత్సహించడమే ఈ కఠిన నిర్ణయం ముఖ్య ఉద్దేశమని ట్రంప్ సర్కార్ వాదించింది.

పాత ఫీజుల వివరాలు: ఈ వివాదాస్పద మార్పు కంటే ముందు, సాధారణంగా అమెరికా యజమానులు (Employers) ఒక హెచ్-1బీ వీసాకు సంబంధించి కేవలం $2,000 నుండి $5,000 వరకు మాత్రమే ఫీజుగా చెల్లించేవారు. దానిని ఒక్కసారిగా లక్ష డాలర్లకు పెంచడంతో కంపెనీలపై మోయలేని భారం పడింది.

దీనికి వ్యతిరేకంగా కాలిఫోర్నియాతో పాటు మరో 19 డెమోక్రాట్ నేతృత్వంలోని రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. తనంతట తానుగా ఇలాంటి భారీ ఫీజును సృష్టించే చట్టపరమైన హక్కు అధ్యక్షుడికి లేదన్న రాష్ట్రాల వాదనతో జడ్జి ఏకీభవించారు. యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇంకా పలు ఐటీ వ్యాపార సమూహాలు కూడా దీనిపై వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే, ఈ ఫెడరల్ కోర్టు తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అప్పీలుకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

భారతీయులకు ఈ తీర్పు ఎందుకు అంత ముఖ్యం?

ఉన్నత విద్యావంతులు, సాంకేతిక నైపుణ్యం కలిగిన భారతీయులు అమెరికాలో స్థిరపడటానికి హెచ్-1బీ (H-1B) వీసా ఒక ప్రధాన వారధి. టెక్నాలజీ (IT), ఇంజనీరింగ్, హెల్త్‌కేర్ (వైద్యం) ఫైనాన్స్ (ఆర్థిక) రంగాలలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన విదేశీయులను నియమించుకోవడానికి అమెరికా కంపెనీలు ఈ వీసానే నమ్ముకుంటాయి. ప్రతి సంవత్సరం అమెరికా జారీ చేసే మొత్తం హెచ్-1బీ వీసాలలో అత్యధిక శాతం నిరంతరాయంగా భారతీయ పౌరులకే లభిస్తుండటంతో ఈ తీర్పు భారత్‌కు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.

ఒక నజర్: హెచ్-1బీ వీసా వ్యవస్థ గణాంకాలు

అమెరికా వలస విధానంలో నైపుణ్యం కలిగిన కార్మికుల భవిష్యత్తును నిర్ణయించడంలో హెచ్-1బీ వీసా ఎప్పుడూ ఒక మైలురాయిగా నిలుస్తుంది.

ఈ ప్రోగ్రామ్ కింద అమెరికా ఏటా 65,000 వీసాలను సాధారణ కోటాలో జారీ చేస్తుంది. దీనితో పాటు అమెరికా విద్యాసంస్థల్లో ఉన్నత డిగ్రీలు (Advanced Degrees) పూర్తి చేసిన వారి కోసం అదనంగా మరో 20,000 వీసాలను కేటాయిస్తుంది. ఇమ్మిగ్రేషన్ అడ్వకేసీ గ్రూప్ ‘FWD.us’ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం దాదాపు 7,30,000 మంది హెచ్-1బీ వీసాదారులు అమెరికాలో నివసిస్తున్నారు. వీరితో పాటు వారిపై ఆధారపడిన భార్యాపిల్లలు (Dependents) సుమారు 5,50,000 మంది అక్కడ జీవనం సాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *