Unstoppable With NBK: నందమూరి బాలకృష్ణ పాపులర్ టాక్ షో అన్ స్టాపబుల్ సీజన్ 4 ప్రస్తుతం టెలీకాస్ట్ అవుతోంది. నారా చంద్రబాబు నాయుడుతో మొదలైన ఈ సీజన్ లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్యంగా సినిమా రిలీజ్ సందర్భంగా ఆ యా తారలతో బాలకృష్ణ ఆసక్తికరమైన ముచ్చట్లు జరిపారు. సంక్రాంతి కానుకగా వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా జనవరి 14న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మొదటిసారి ఆయన అన్ స్టాపబుల్ షోకు హాజరవుతున్నారు. దీనికి సంబంధించిన చిత్రీకరణ డిసెంబర్ 22న జరుగబోతోంది. మరి బాలకృష్ణ… తన తోటి సీనియర్ స్టార్ హీరో వెంకటేశ్ నుండి ఎలాంటి సమాధానాలు రాబడతాడో చూడాలి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీని అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఐశ్వర్యా రాజేశ్ ఇందులో హీరోయిన్ కాగా… మీనాక్షి చౌదరి కీలక పాత్రను పోషించింది.