Kishan Reddy: హైదరాబాద్ నగరం సుదీర్ఘ కాలంగా మజ్లిస్ (AIMIM) పార్టీ గుప్పిట్లోనే ఉండిపోయిందని, త్వరలోనే ఆ కబంధ హస్తాల నుండి భాగ్యనగరానికి విముక్తి కలిగిస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత జి. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు తెలంగాణలో ఏ ప్రభుత్వాలు పాలించినప్పటికీ.. కేవలం తమ ఓటు బ్యాంక్ ప్రయోజనాల కోసమే మజ్లిస్ పార్టీకి లొంగిపోయి, వారికి పెద్దపీట వేస్తూ వచ్చాయని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలపై పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) విభజన నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై కిషన్ రెడ్డి వ్యూహాత్మక ప్రకటన చేశారు. విభజన తర్వాత ఏర్పడే మూడు కార్పొరేషన్లలోనూ క్లీన్ స్వీప్ చేసి విజయం సాధించడమే తమ తదుపరి లక్ష్యమని స్పష్టం చేశారు. “రాబోయే ఎన్నికల్లో మూడు కార్పొరేషన్లపై బీజేపీ జెండా ఎగురవేయడమే మా ఏకైక టార్గెట్. మజ్లిస్ చెప్పినట్లు వింటూ, ఆ పార్టీ అజెండాను మోసే సంస్కృతికి బీజేపీ పూర్తి ముగింపు పాడుతుంది. హైదరాబాద్ ప్రజలకు ఆ పార్టీ చెర నుండి స్వేచ్ఛను ప్రసాదించే బాధ్యతను బీజేపీ భుజాలకెత్తుకుంటుంది” అని ఆయన ధీమాగా ప్రకటించారు.
ఇదే వేదికపై నుంచి రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ హయాంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని, ఆ పార్టీ పూర్తిగా అవినీతి కూపంలో మునిగిపోయిందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకమైన ప్రజా వ్యతిరేక విధానాలు, స్కామ్‌లతో రాష్ట్రాన్ని పాలించిందో.. ప్రస్తుత రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలన కూడా సరిగ్గా అదే బాటలో సాగుతోందని విమర్శించారు. కేవలం బోర్డులు మారాయే తప్ప కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్కు ఎలాంటి వ్యత్యాసం లేదని తెలంగాణ ప్రజలు ఇప్పటికే ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చారని పేర్కొన్నారు. ఈ రెండు పార్టీల వైఫల్యాల వల్ల రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసే ఏకైక బలమైన ప్రత్యామ్నాయ శక్తి బీజేపీ మాత్రమేనని.. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ జైత్రయాత్రను ఎవరూ ఆపలేరని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
