Jagtial: జగిత్యాల జిల్లాలో అత్యంత హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. మూడేళ్లుగా కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచుకుంటున్న చిన్నారిని, చట్టబద్ధమైన నిబంధనల పేరుతో అధికారులు తల్లిదండ్రుల నుంచి వేరు చేసి శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత బాబును వెంటనే తల్లిదండ్రులకు అప్పగించాలంటూ రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ, అధికారుల ఉదాసీనత, జాప్యం వల్ల ఆ చిన్నారి ఇంకా సంరక్షణ కేంద్రంలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాడు. సంరక్షణ కేంద్రానికి వెళ్లిన తల్లిని పట్టుకుని నన్ను ఇంటికి తీసుకెళ్లు అమ్మా.. ఇక్కడ భయమేస్తుంది అంటూ ఆ పసివాడు రోదించిన తీరు చూపరుల చేత కన్నీరు పెట్టించింది.
అసలేం జరిగింది? మూడేళ్ల బంధాన్ని తెంచేసిన అధికారులు!
బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. సంతానం లేకపోవడంతో సదరు దంపతులు మూడేళ్ల క్రితం హిందూ సంప్రదాయాల ప్రకారం ఒక బాబును దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి ఆ చిన్నారిని ప్రాణంగా చూసుకుంటూ పెంచి పెద్ద చేస్తున్నారు. అయితే, లీగల్ ప్రాసెస్ ప్రకారం చట్టబద్ధంగా దత్తత తీసుకోలేదంటూ ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదుతో శిశు సంక్షేమ శాఖ (CWC) అధికారులు రంగంలోకి దిగారు.నిబంధనల పేరుతో మూడేళ్ల బాబును తల్లి ఒడి నుంచి బలవంతంగా లాక్కెళ్లి స్థానిక శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు.
“నన్ను తీసుకెళ్లు అమ్మా.. భయమేస్తుంది”
చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించాలని కోర్టు ఆదేశాలు ఉన్నా అప్పగించని అధికారులు
జగిత్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన
చట్టపరంగా దత్తత తీసుకోలేదని, మూడేళ్లుగా పెంచుకుంటున్న చిన్నారిని తల్లిదండ్రుల నుంచి వేరు చేసి శిశు సంక్షేమ కేంద్రానికి తరలించిన అధికారులు
ఈ క్రమంలో శిశు సంక్షేమ కేంద్రంలో ఉన్న చిన్నారిని చూసేందుకు వెళ్లగా, “నన్ను తీసుకెళ్లు అమ్మా.. భయమేస్తుంది” అంటూ గుండెలవిసేలా రోదించిన చిన్నారి
హిందూ సంప్రదాయం ప్రకారమే దత్తత తీసుకున్నామని హైకోర్టును ఆశ్రయించగా, చిన్నారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలని అక్టోబర్ 16వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
అయితే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా అధికారులు జాప్యం చేస్తున్నారని, తమ కొడుకు ఆరోగ్యం క్షీణిస్తోందని, వెంటనే తమ కొడుకును తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్న తల్లిదండ్రులు
— Telugu Scribe (@TeluguScribe) November 2, 2026
