Union Budget 2026:కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2026-27 ప్రసంగంలో ఎలక్ట్రానిక్ రంగానికి మరియు పర్యావరణ హితమైన ఇంధన రంగానికి (Clean Energy) పెద్దపీట వేశారు. ముఖ్యంగా లిథియం-అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించి ఆమె తీసుకున్న నిర్ణయం సామాన్యుడి జేబుకు ఉపశమనాన్ని ఇవ్వబోతోంది.
ధరలు తగ్గనున్నాయి: లిథియం-అయాన్ సెల్స్ తయారీలో వాడే యంత్రాలపై (Capital Goods) ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం మినహాయించింది. దీనివల్ల బ్యాటరీల తయారీ ఖర్చు భారీగా తగ్గుతుంది. ఫలితంగా మన నిత్యజీవితంలో వాడే ఈ క్రింది వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది:
- మొబైల్ ఫోన్లు: బ్యాటరీ ఖర్చు తగ్గడంతో స్మార్ట్‌ఫోన్ల ధరలు అందుబాటులోకి వస్తాయి.
- ఎలక్ట్రిక్ వాహనాలు (EVs): ఈవీల ధరలో బ్యాటరీనే అత్యంత ఖరీదైనది. ఇప్పుడు ఈ మినహాయింపుతో ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్ల ధరలు తగ్గి సామాన్యులకు దగ్గరవుతాయి.
- బ్యాటరీ స్టోరేజ్: సోలార్ పవర్ నిల్వ చేసే బ్యాటరీల ధరలు కూడా తగ్గుతాయి.
ఇది కూడా చదవండి: Miryalaguda: మిర్యాలగూడ ఎమ్మెల్యేనా? మజాకా!
స్వదేశీ తయారీకి ఊతం: ఈ నిర్ణయం కేవలం ధరలు తగ్గడానికే కాకుండా, దేశీయంగా బ్యాటరీల తయారీ సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా భారత్‌ను ప్రపంచ క్లీన్ ఎనర్జీ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ఈ మినహాయింపులు ఇచ్చారు. దిగుమతులపై ఆధారపడటం తగ్గించి, మన దేశంలోనే నాణ్యమైన బ్యాటరీలను తయారు చేసే కంపెనీలకు ఇది ఒక పెద్ద వరమని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నిర్ణయం ద్వారా అటు పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడమే కాకుండా, టెక్నాలజీ పరంగా భారత్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది.
