Miryalaguda:

Miryalaguda: మిర్యాల‌గూడ ఎమ్మెల్యేనా? మ‌జాకా!

Miryalaguda: న‌ల్ల‌గొండ జిల్లాలోని మిర్యాల‌గూడ మున్సిప‌ల్ ఎన్నిక‌లు రాష్ట్ర‌వ్యాప్తంగా ఆస‌క్తిని రేకెత్తించాయి. జిల్లాలోనే అతి పెద్ద‌దైన ఈ మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్‌ పార్టీలోనే వ‌ర్గ‌పోరు తారాస్థాయికి చేరుకున్న‌ది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌క‌పోగా, ఎవ‌రికీ బీపామ్‌లు ఇవ్వ‌లేదు. ఎవ‌రికి బీఫామ్ ద‌క్కుతుందోన‌నే అయోమ‌యం నెల‌కొన్న‌ది. ఈ ద‌శ‌లో మిర్యాల‌గూడ ఎమ్మెల్యే బ‌త్తుల ల‌క్ష్మారెడ్డి వైఖ‌రి చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Miryalaguda: మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే ల‌క్ష్మారెడ్డి కుటుంబం నుంచి ముగ్గురు కుటుంబ స‌భ్యులు వేర్వేరు వార్డుల్లో నామినేష‌న్లు వేసిన అంశం చ‌ర్చ‌కు దారితీసింది. ఎమ్మెల్యే స‌తీమ‌ణితోపాటు ఆయ‌న ఇద్ద‌రు కుమారులు నామినేష‌న్లు వేశారు. దీనిపై ఫ్యామిలీ ప్యాక్ రాజ‌కీయాలు అని ఆయ‌న ప్ర‌త్య‌ర్థులు సెటైర్లు వేస్తుండ‌గా, ప్ర‌త్య‌ర్థుల‌ కుట్ర‌ల‌ను తిప్పికొట్టేందుకు ఎమ్మెల్యే ఈ వైఖ‌రి అవ‌లంబించార‌ని ఆయ‌న మ‌ద్ద‌తుదారులు చెప్పుకొస్తున్నారు.

Miryalaguda: మిర్యాల‌గూడ మున్సిపాలిటీలో మొత్తం 48 వార్డులు ఉన్నాయి. ఆ వార్డుల‌కు గాను ఒక వార్డులో ఎమ్మెల్యే బీ ల‌క్ష్మారెడ్డి స‌తీమ‌ణి మాధ‌వి, మ‌రో రెండు వార్డుల్లో ఆయ‌న త‌న‌యులు నామినేష‌న్లు వేశారు. 39వ వార్డు నుంచి బ‌త్తుల‌ మాధ‌వి నామినేష‌న్ వేయ‌గా, 40వ వార్డు నుంచి ఎమ్మెల్యే పెద్ద కుమారుడు సాయి ప్ర‌స‌న్న‌, 28వ వార్డు నుంచి ఎమ్మెల్యే చిన్న కుమారుడు ఈశ్వ‌ర గ‌ణేశ్‌కుమార్ నామినేష‌న్లు వేశారు.

Miryalaguda: ఇదిలా ఉండ‌గా, ఇప్ప‌టికే ఇదే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ శంక‌ర్‌నాయ‌క్ వ‌ర్గానికి, ఎమ్మెల్యే ల‌క్ష్మారెడ్డి వ‌ర్గానికి మ‌ధ్య వైరం ఉన్న‌ది. త‌మ ఆధిప‌త్యం కోసం ఇద్ద‌రూ పాకులాడుతున్నార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఎమ్మెల్సీ శంక‌ర్ నాయ‌క్‌కు మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత కే జానారెడ్డి, ఆయ‌న త‌న‌యుడు, న‌ల్ల‌గొండ ఎంపీ ర‌ఘువీర్‌రెడ్డి మ‌ద్ద‌తు ఉన్న‌ది. ఇదే స‌మ‌యంలో గ‌తంలో మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్‌గా ప‌నిచేసిన తిరున‌గ‌ర్ భార్గ‌వ్‌, ఆయ‌న స‌తీమ‌ణి నాగ‌ల‌క్ష్మి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. వీరు కూడా ప‌ట్ట‌ణంలో పెద్ద ఎత్తున అనుచ‌ర‌గ‌ణం క‌లిగి ఉన్నారు.

Miryalaguda: ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన మిర్యాల‌గూడ మున్సిపాలిటీలో మూడు వ‌ర్గాలు త‌మ ఆధిప‌త్యం కోసం పాకులాడుతున్నార‌ని బ‌హిర్గ‌త‌మైంది. ఎవ‌రికి వారుగా నామినేష‌న్లు దాఖ‌లు చేయించారు. త‌మ వ‌ర్గం వారికే టికెట్లు కావాల‌ని ఎమ్మెల్యే స‌హా శంక‌ర్‌నాయ‌క్‌, భార్గ‌వ్ వ‌ర్గీయులు ప‌ట్టుబ‌ట్టడంతో తిర‌కాసు ఏర్ప‌డింది. అందుకే ఎవ‌రికీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వ‌లేదు.

Miryalaguda: ఈ నేప‌థ్యంలో త‌న ప‌ట్టును నిలుపుకొనేందుకు ఎమ్మెల్యే ఒకింత అస‌హ‌నంతోనే ఆయ‌న కుటుంబీకులతో నామినేష‌న్లు వేయించిన‌ట్టు ఆయ‌న వ‌ర్గీయులు చెప్తున్నారు. ఇదే స‌మ‌యంలో మాజీ చైర్మ‌న్ తిరున‌గ‌ర్ నాగ‌లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు వేణుగోపాల్‌రెడ్డి స‌తీమ‌ణి క‌విత కూడా నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. జ‌న‌ర‌ల్ మ‌హిళ‌కు చైర్‌ప‌ర్స‌న్ పీఠం ద‌క్క‌డంతో ఈ పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *