Hyderabad: హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో ట్రాన్స్‌జెండర్లకు కొత్త అవకాశం కల్పించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. సోమవారం నుంచి 39 మంది ట్రాన్స్‌జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆదివారం వీరికి ట్రాఫిక్ గుర్తులు, డ్రిల్ మరియు ఇతర తగిన శిక్షణ అందించారు.
ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ, ట్రాన్స్‌జెండర్లు సమాజంలో కుటుంబాల్లో అనేక వివక్షలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఒక అవకాశం ఇవ్వడం ద్వారా, వారిని సమాజంతో అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా హోంగార్డు క్యాడర్ కింద ట్రాఫిక్ అసిస్టెంట్లుగా పనిచేసే అవకాశం కల్పించిందని వెల్లడించారు.
ఈ నిర్ణయం ట్రాన్స్‌జెండర్లకు ఆర్థిక స్వావలంబన కల్పించడంతో పాటు సమాజంలో గౌరవాన్ని కూడా తెస్తుందని అన్నారు. ఈ చర్య ఇతర రాష్ట్రాలకు కూడా ఒక మంచి ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.