Switzerland

Switzerland: స్విట్జర్లాండ్‌ న్యూఇయర్‌ వేడుకల్లో తీవ్ర విషాదం..!

Switzerland: ప్రపంచమంతా కొత్త ఏడాది సంబరాల్లో మునిగిపోయిన వేళ, స్విట్జర్లాండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన క్రాన్స్ మోంటానాలో పెను విషాదం చోటుచేసుకుంది. నూతన సంవత్సర వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్న సమయంలో, అక్కడి ఒక విలాసవంతమైన ఆల్పైన్ స్కీ రిసార్ట్‌లోని ‘లే కాన్‌స్టెల్లేషన్’ బార్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో సుమారు 40 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మంటల ధాటికి బార్ పూర్తిగా దగ్ధమవగా, క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్థానిక కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో బార్‌లో సుమారు 100 మందికి పైగా ఉన్నారని పోలీసులు తొలుత భావించినప్పటికీ, స్థానిక మీడియా కథనాల ప్రకారం బేస్‌మెంట్‌తో కలిపి సుమారు 400 మంది వరకు పర్యాటకులు అక్కడ గుమిగూడినట్లు తెలుస్తోంది. పేలుడు సంభవించిన వెంటనే భారీగా మంటలు చెలరేగడంతో లోపల ఉన్నవారు ప్రాణభయంతో పరుగులు తీశారు. సహాయక చర్యల కోసం పెద్ద ఎత్తున అగ్నిమాపక యంత్రాలు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ రిసార్ట్ ప్రాంతం బ్రిటీష్ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన ప్రదేశం కావడంతో, బాధితుల్లో ఎక్కువ మంది విదేశీయులే ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Also Read: Vande Bharat Sleeper: పట్టాలెక్కనున్న తొలి ‘వందే భారత్ స్లీపర్’ ట్రైన్!

ఈ ప్రమాదానికి గల కారణాలపై తొలుత పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇది ఉగ్రవాద దాడి లేదా కాల్పుల ఘటన కావచ్చని వార్తలు వచ్చినప్పటికీ, ప్రాథమిక దర్యాప్తు తర్వాత పోలీసులు వాటిని తోసిపుచ్చారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన కచేరీ సమయంలో కాల్చిన బాణసంచా వల్లే ఈ భారీ పేలుడు సంభవించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. బాణసంచా నిప్పురవ్వలు బార్‌లోని మండే స్వభావం ఉన్న వస్తువులకు అంటుకుని ప్రమాదం జరిగి ఉండవచ్చని వాలిస్ కాంటన్ పోలీస్ ప్రతినిధి గేటాన్ లాథియాన్ మీడియాకు వివరించారు. ఈ ఘోర దుర్ఘటనతో పర్యాటక ప్రాంతమైన క్రాన్స్ మోంటానాలో విషాద ఛాయలు అలముకున్నాయి. గతంలో 2012లో జరిగిన బస్సు ప్రమాదం తర్వాత ఈ ప్రాంతంలో జరిగిన అత్యంత దారుణమైన ఘటన ఇదేనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *