Minister anagani satyaprasad: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులు, భూ యజమానులకు కూటమి ప్రభుత్వం నూతన సంవత్సర శుభవార్త అందించింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని 22ఏ నిషిద్ధ జాబితా నుంచి 5 రకాల భూములను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గురువారం తన శాఖలో తొలి సంతకం చేశారు.
మంత్రి ఆదేశాల మేరకు ప్రైవేట్ పట్టా భూములను 22ఏ జాబితా నుంచి పూర్తిగా తొలగించారు. ఈ భూములకు సంబంధించి దరఖాస్తులు వచ్చినా రాకపోయినా, అధికారులే సుమోటోగా చర్యలు తీసుకుని నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలని స్పష్టం చేశారు. దీంతో భూ లావాదేవీల్లో ఎదురవుతున్న అనేక అవరోధాలు తొలగిపోనున్నాయి.
అలాగే సరైన పత్రాలు కలిగిన మాజీ, ప్రస్తుత సైనిక ఉద్యోగుల భూములు, స్వాతంత్ర్య సమరయోధుల భూములను కూడా 22ఏ జాబితా నుంచి మినహాయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన భూములపై త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘం (జీఓఎం)లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, భూ యజమానుల హక్కులను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఫ్రీహోల్డ్ భూములపై రెండు నెలల్లో సానుకూల నిర్ణయం తీసుకుని, ఫిబ్రవరి నుంచి అమలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
జనవరి 2 నుంచి ఇంటింటికీ వెళ్లి రైతులకు కొత్త పాస్‌బుక్‌ల పంపిణీ చేపడతామని మంత్రి ప్రకటించారు. భూ అక్రమాలను అరికట్టేందుకు ఆధార్‌తో సర్వే నంబర్‌ను అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోందని, దీనికోసం ప్రత్యేక యాప్‌ను కూడా త్వరలో ప్రవేశపెడతామని తెలిపారు. భూ వివాదాల్లో తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రైతులు, భూ యజమానులకు భారీ ఊరట లభించనుంది. భూ రిజిస్ట్రేషన్లు, లావాదేవీలు ఇకపై మరింత సులభతరం కానున్నాయని అధికారులు భావిస్తున్నారు.
