CP sajjanar: వృద్ధాశ్రమాలు లేని సమాజం కావాలి

Cp sajjanar: నూతన సంవత్సరాన్ని సేవా భావంతో ప్రారంభించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అక్కడ నివసిస్తున్న 48 మంది వృద్ధుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి పావలా శ్యామలను కూడా ఆయన పరామర్శించారు.

నూతన సంవత్సరం వేడుకలు అంటే కేవలం హంగులు, సంబరాలే కాదని, ఆత్మీయతను పంచుకోవడం, బాధ్యతను గుర్తుచేసుకోవడమే అసలైన ఉద్దేశమని సజ్జనార్ పేర్కొన్నారు. ఇదే సంకల్పంతో కొత్త ఏడాది తొలి రోజును నిరాడంబరంగా, సేవా దృక్పథంతో ప్రారంభించానని ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తెలిపారు.

పావలా శ్యామల అనారోగ్య పరిస్థితిపై స్పందించి ఆమెను హెల్త్ కేర్ సెంటర్‌లో చేర్పించిన తిరుమలగిరి ఏసీపీ రమేశ్‌ను సజ్జనార్ అభినందించారు. అలాగే ఆర్కే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ రామకృష్ణ గత 18 ఏళ్లుగా వేలాదిమందికి ఉచిత వైద్యం, ఆశ్రయం అందిస్తూ చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఆయన సేవలు సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.

ఈ సందర్భంగా సజ్జనార్ భావోద్వేగ విజ్ఞప్తి చేశారు.
“వృద్ధాశ్రమాలు అవసరం లేని సమాజం రావాలి. మనల్ని కంటికి రెప్పలా పెంచిన తల్లిదండ్రుల రుణం ఎంత చేసినా తీరదు. ఆధునిక జీవనశైలి, ఒత్తిళ్ల పేరిట వారిని వృద్ధాశ్రమాలకు పరిమితం చేయకూడదు. జీవిత చరమాంకంలో వారికి కావాల్సింది ఆస్తులు కాదు… పిల్లల ఆప్యాయత, నాలుగు తీపి మాటలు మాత్రమే. తల్లిదండ్రులను భారంగా కాకుండా బాధ్యతగా, దైవంగా భావిద్దాం. వారి సేవలోనే నిజమైన ఆనందం, మోక్షం దాగి ఉంది” అని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *