Hyderabad

Hyderabad: సంక్రాంతి సందడి.. పల్లెబాట పట్టిన భాగ్యనగరవాసులు.. హైవేలపై భారీగా ట్రాఫిక్ జామ్!

Hyderabad: సంక్రాంతి పండుగ వచ్చేసింది.. భాగ్యనగరం ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే వారితో హైదరాబాద్‌లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనసంద్రంగా మారాయి. శనివారం ఉదయం నుంచే నగరవాసులు తమ లగేజీలతో ఊళ్ల వైపు పరుగులు తీస్తుండటంతో అటు హైవేలు, ఇటు ప్రధాన కూడళ్లు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. చౌటుప్పల్, పంతంగి టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

ట్రాఫిక్ కష్టాల దృష్ట్యా పోలీసులు వాహనదారులకు కీలక సూచనలు చేశారు. రద్దీని తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరారు. విజయవాడ వైపు వెళ్లే వారు భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవచ్చని సూచించారు. అలాగే గుంటూరు, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు సాగర్ హైవే గుండా ప్రయాణిస్తే సమయం ఆదా అవుతుందని అధికారులు వెల్లడించారు.

మరోవైపు ఆర్టీసీ బస్టాండ్లు పండుగ కళను సంతరించుకున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు ప్రయాణికులతో నిండిపోయాయి. ఎల్బీనగర్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్ వంటి ప్రాంతాల్లో జనం బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అటు రైల్వే స్టేషన్లలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ప్లాట్‌ఫారమ్‌లన్నీ జనంతో నిండిపోయాయి. పండుగకు అందరూ క్షేమంగా చేరుకోవాలని పోలీసులు, రవాణా శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *