Hyderabad: హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము హైదరాబాద్ లో పర్యటిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నటు నగర పోలీసులు తెలిపారు. నిన్న సాయంత్రం బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆమె.. ఎన్టీఆర్ స్టేడియం వద్ద భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం వేడుకలో పాల్గొన్నారు. రాత్రికి రాజ్ భవన్ లోనే బస చేశారు. ఈరోజు (శుక్రవారం) ఉదయం 10.20 గంటలకు శిల్పకళావేదికలో లోక్ మంథన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
నగరంలో రాష్ట్రపతి పర్యటన జరుగుతున్న నేపథ్యంలో నేడు హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. రాజ్ భవన్ నుంచి తాజ్ కృష్ణ రోడ్ వరకూ ఆంక్షలు విధించారు. సాగర్ సొసైటీ, జూబ్లీహిల్స్, కేబుల్ బ్రిడ్జి పంజాగుట్ట, బేగంపేట ఎయిర్ పోర్టు వరకూ ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.