CM Vijay

CM Vijay: హాస్టల్‌లో సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీ.. కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థులు, అధికారులకు వార్నింగ్!

CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ శుక్రవారం చెన్నైలోని ఓ ప్రభుత్వ హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీ (Surprise Visit) చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సైదాపేటలోని ఎంసీ రాజా సోషల్ జస్టిస్ స్టూడెంట్స్ హాస్టల్‌కు ఆయన సడెన్‌గా వెళ్లడంతో, అక్కడి విద్యార్థులు తమ బాధలను ఆయన ముందు వెళ్లగక్కారు.

“అన్నా.. అన్నంలో పురుగులు వస్తున్నాయ్” అని పిల్లలు చెప్పిన మాటలకు సీఎం విజయ్ తీవ్రంగా చలించిపోయారు.

విద్యార్థులు చెప్పిన ప్రధాన సమస్యలు ఇవే:

సీఎం విజయ్‌ను నేరుగా కలిసిన విద్యార్థులు తమకు రోజూ ఎదురవుతున్న నరకాన్ని పూసగుచ్చినట్లు వివరించారు.

  • పురుగుల భోజనం: అన్నంలో పురుగులు వస్తున్నాయని, కంప్లైంట్ చేస్తే కొద్ది రోజులు బాగా పెట్టి మళ్లీ పాత కథే రిపీట్ చేస్తున్నారని చెప్పారు. వంట చేసేవాళ్లు కనీసం గ్లౌజులు, క్యాప్స్ వాడటం లేదని, కిచెన్ అస్సలు శుభ్రంగా ఉండటం లేదని వాపోయారు.

  • గేట్లు మూసేస్తున్నారు: రాత్రి పూట కోచింగ్ క్లాసులు లేదా పార్ట్ టైమ్ పనులు ముగించుకుని వచ్చేసరికి 9:30 దాటితే హాస్టల్ గేట్లు మూసేస్తున్నారని.. దీనివల్ల రాత్రంతా బయటే పడుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

  • నీళ్ల కష్టాలు.. కంపుకొడుతున్న బాత్‌రూమ్‌లు: త్రాగడానికి నీళ్లు సరిగ్గా రావడం లేదని, మరుగుదొడ్లు చాలా అపరిశుభ్రంగా ఉంటున్నాయని తెలిపారు.

  • భద్రత లేదు: హాస్టల్‌లో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు లేవని, సరైన భద్రత కరువైందని చెప్పారు. అలాగే ఆడుకోవడానికి స్పోర్ట్స్ సదుపాయాలు, మోడ్రన్ జిమ్, లైబ్రరీలో మరిన్ని పుస్తకాలు ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు.

రూ.44.50 కోట్లతో కట్టినా.. నిర్వహణ శూన్యం!

ఈ 10 అంతస్తుల హాస్టల్‌ను గత డీఎంకే (DMK) ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ కాలేజీ విద్యార్థుల కోసం సుమారు రూ.44.50 కోట్లతో నిర్మించారు. భవనంలో లిఫ్టులు సహా ఆధునిక సదుపాయాలు ఉన్నప్పటికీ.. అధికారుల నిర్వహణ (Maintenance) లోపం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అధికారులకు సీఎం విజయ్ సీరియస్ వార్నింగ్

విద్యార్థుల సమస్యలను ఓపికగా విన్న సీఎం విజయ్.. స్వయంగా హాస్టల్ గదులు, వంటగది, మరుగుదొడ్లను పరిశీలించారు. అక్కడి అధ్వాన్నపు పరిస్థితిని చూసి అధికారులపై మండిపడ్డారు. తక్షణమే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని, తాను తదుపరి తనిఖీకి వచ్చేలోపు ఈ లోపాలన్నీ ఖచ్చితంగా సరిదిద్దాలని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.

ప్రజల వద్దకే సీఎం!

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ ఇలా ఆకస్మిక తనిఖీ చేయడం ఇది వరుసగా రెండోసారి. ఇటీవల ఆయన ఎగ్మోర్‌లోని చిన్నపిల్లల ఆసుపత్రిని కూడా సడెన్‌గా తనిఖీ చేశారు. “ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి సీఎం దగ్గరకు రావడం కాదు.. సీఎమ్మే నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లాలి” అనే కొత్త పద్ధతికి ఆయన శ్రీకారం చుట్టడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *