TTD Ghee Adulteration Case

TTD Ghee Adulteration Case: తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఈడీ ఎంట్రీ.. దేశవ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో సోదాలు!

TTD Ghee Adulteration Case: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రంగంలోకి దిగారు. ఈ కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా గురువారం భారీ సోదాలు నిర్వహించారు. దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్న దాదాపు 15 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఒకేసారి తనిఖీలు చేపట్టడం తీవ్ర సంచలనం సృష్టించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుతో పాటు దేశ రాజధాని ఢిల్లీ, ముంబయి, రాజ్‌కోట్, బికనీర్‌, దెహ్రాదూన్‌, రూర్కీ, అహల్యానగర్‌, దిండిగల్‌ వంటి నగరాల్లో ఈ సోదాలు జరిగాయి. నెయ్యి సరఫరా చేసిన వ్యాపారులు, ఈ వ్యవహారంతో సంబంధం ఉందనే అనుమానం ఉన్న పలువురి ఇళ్లు, కార్యాలయాలను అధికారులు జల్లెడ పట్టారు. ముఖ్యంగా పోమిల్‌ జైన్‌, విపిన్‌ జైన్, రాజు రాజశేఖరన్‌, రాజేశ్‌ మన్సుఖ్‌లాల్‌, అపూర్వ వినయకాంత్‌, శాంతారామ్‌, అజయ్‌ కుమార్‌, మహేశ్‌కుమార్‌, ఆశిష్‌ అగర్వాల్‌ అనే వ్యక్తుల నివాసాల్లో తనిఖీలు చేశారు.

ఈ సోదాల్లో ఈడీ అధికారులు భారీగా నగదును, ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఇళ్ల నుంచి దాదాపు రూ.60 లక్షల నగదును సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా, కల్తీ నెయ్యి సరఫరా ద్వారా సంపాదించిన సొమ్ముతో వీరు వివిధ రకాల స్థిర, చరాస్తుల్లో ఏకంగా రూ.45 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని కీలక ఆధారాల కోసం అధికారులు డిజిటల్ రికార్డులను, బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *