Crime News: బాలికను కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడిన కేసులో నిందితుడి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సూరారం పోలీస్ స్టేషన్‌లో మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా పాటగూడకు చెందిన సుమ భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇద్దరు కుమారైలతో సహా నగరానికి వలస వచ్చి స్థానిక జీవన్ జ్యోతినగర్‌లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ప్రభాకర్‌తో గత కొంతకాలంగా సహజీవనం చేస్తుంది. అదే జిల్లాకు చెందిన తిరుపతి కూడా జీవన్ జ్యోతినగర్‌లో ఉంటున్నాడు.
ఈ నేపథ్యంలో అతడికి ప్రభాకర్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో తరచూ ప్రభాకర్ ఇంటికి వచ్చే తిరుపతి అతడితో కలిసి మద్యం తాగుతూ, పిల్లలతో చనువుగా ఉండేవాడు. ఈ క్రమంలో సుమపై కన్నేసిన తిరుపతి, ఇద్దరు పిల్లలతో పాటు ప్రభాకర్‌ను అంతమందించి ఆమెను లోబర్చుకోవాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా ఈ నెల 12న సుమ పెద్ద కూతురు జోత్స్నను హత్య చేసేందుకు బయటికి తీసుకెళ్లిన తిరుపతి అవకాశం దొరక్క.. ఇంటికి తీసుకువచ్చాడు. మళ్లీ చిన్నారిని తీసుకెళ్లిన అతను బాసరగడి గ్రామ సమీపంలోని చెట్ల పొదల్లో కత్తితో పొడిచి హత్య చేశాడు. బాలిక మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి, గోనె సంచీలో మూట కట్టి తిరిగి ఇ:టికి వచ్చాడు.
ఏమీ తెలియనట్టు ప్రభాకర్‌తో కలిసి జోత్స్న ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు నటించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సూరారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాలుగు బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాలు పరిశీలించడగా తిరుపతి బాలికను తీసుకెళ్లినట్లు నిర్ధారించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకొని బాలికను హత్య చేసిన ప్రదేశాన్ని చూపించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని పట్టుకోవడానికి కృషి చేసిన సిబ్బందికి రివార్డు అందజేసినట్లు ఏసీపీ తెలిపారు.