Visakhapatnam: విశాఖపట్నం రుషికొండ బీచ్ రోడ్డులో మంగళవారం ఉదయం ఒక భయంకరమైన ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, చూస్తుండగానే బస్సు మొత్తం అగ్నికి ఆహుతైపోయింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని గవర్నర్ బంగ్లా ప్రాంతం నుంచి భీమిలిలోని ఒక ప్రైవేటు స్కూలుకు వెళ్లేందుకు ఈ బస్సు ఉదయం 6 గంటల సమయంలో బయలుదేరింది. బస్సు రుషికొండ సమీపానికి చేరుకోగానే, ఇంజిన్ భాగం నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడాన్ని డ్రైవర్ రాజేష్ గమనించారు. ప్రమాదాన్ని పసిగట్టిన ఆయన వెంటనే చాకచక్యంగా వ్యవహరించి, బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి కిందకు దిగిపోయారు.
డ్రైవర్ కిందకు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు అంతటా వేగంగా వ్యాపించాయి. మంటల ధాటికి బస్సు పూర్తిగా కాలిపోయి కేవలం ఇనుప అస్థిపంజరంలా మిగిలింది. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.
