Thandel Review

Thandel Review: భావోద్వేగ ప్రేమ కథ.. నాగచైతన్య తండేల్ మూవీ.. ఎలా ఉందంటే..

Thandel Review: అక్కినేని నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచిన మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రమోషన్స్ తో విపరీతమైన హైప్ వచ్చింది. ట్రైలర్స్, పాటలు ఇంటర్నెట్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాయి. దీంతో అక్కినేని అభిమానులే కాకుండా.. ప్రేక్షకులంతా కూడా ఈ మూవీపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. మరి తండేల్ అంచనాలను అందుకుందా? లవ్ స్టోరీ మేజిక్ ను నాగ చైతన్య, సాయిపల్లవి జంట మళ్ళీ రిపీట్ చేసిందా? సినిమా ఎలా ఉంది? ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఒక జాలరి రాజు (Naga Chaitanya ), అతని ప్రేయసి సత్య (Sai Pallavi) ల మధ్య బంధం ఈ సినిమా. వారిద్దరి మధ్య ప్రేమకు.. దేశభక్తిని కలగలిపి చందు మొండేటి ఈ మూవీ రూపొందించారు. రాజు తన ప్రాంతంలోని ప్రజలతో తండేల్ (నాయకుడు) అని పిలిపించుకుంటాడు. ఈ నేపథ్యంలో రాజు భద్రతపై ఆందోళనలు మొదలవుతాయి. దీంతో సత్య అతనిని చేపలు పట్టడం మానేయాలని కోరుతుంది. ఆమె కోరినా రాజు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్తాడు. అనుకోకుండా రాజు, అతని బృందం పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించడంతో పాకిస్తాన్ వారిని జైలులో పడేస్తుంది. దీంతో రాజు, సత్యాల జీవితం తలకిందులు అవుతుంది. మరి రాజు పాకిస్తాన్ జైలు నుంచి విడుదలయ్యాడా? సత్య అతని విడుదల కోసం ఏమి చేసింది? వీరిద్దరి ప్రేమ కష్టాలను జయించిందా? ఇవన్నీ తెలియాలంటే తండేల్ కచ్చితంగా చూడాల్సిందే.

ఇది కూడా చదవండి: Sobhita-Naga Chaitanya: శోభితా ధూళిపాళ్ల ‘తండేల్’ విడుదలపై ఆనందం: చైతన్యకి ప్రత్యేక సందేశం.!

కథగా చెప్పుకోవాలంటే ఇది ఒక సాధారణ ప్రేమకథ.. అయితే, దానికి బలమైన భావోద్వేగాలను జతచేసి, దేశభక్తి నేపధ్యాన్ని తోడుగా చేసి చందు మొండేటి మూవీని తీర్చి దిద్దారు. అయితే, సినిమాలో పాకిస్తాన్ జైలు సీన్స్ మరింత బాగా తీసే అవకాశం ఉన్నా.. పెద్దగా వాడుకోలేదు అనిపిస్తుంది. కొన్ని చోట్ల సీన్స్ మనం ఇంతకు ముందు చూసినట్లు అనిపిస్తాయి. మరింత బలమైన సీన్స్ రాసుకోవచ్చు. మొత్తంగా చూస్తే సినిమా బాగుంటుంది.

చాలాకాలం తరువాత నాగ చైతన్యకు మంచి స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. దానిని నాగ చైతన్య కూడా చక్కగా ఉపయోగించుకున్నారు. చక్కని నటన కనబరిచారు. ముఖ్యంగా లవ్ సీన్స్.. పాకిస్తాన్ జైలు సీన్స్ లో ఎమోషన్స్ వంటి చోట్ల నాగ చైతన్య నటనలో మంచి పరిణితి కనిపించింది. ఇక సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాకి ఆమె ప్లస్. ఆమె నటన ప్లస్ అంతే. తానున్న ప్రతి సీన్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇతర నటులు కూడా తమకున్న పరిధి మేరకు బాగా చేశారు.
దేవిశ్రీ మ్యూజిక్ సినిమాకు మంచి హైప్ ఇచ్చింది. బీజీఎం సినిమాని బాగా ఎలివేట్ చేసింది. షామ్‌దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. అదేవిధంగా నవీన్ నూలి ఎడిటింగ్ బాగానే ఉంది కానీ, కొన్ని చోట్ల ఇంకొంచెం ట్రిమ్ చేయవచ్చు అనిపిస్తుంది. ఇక నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టుగా ఉండడంతో మరింత నిండుతనం వచ్చింది.

మొత్తంమీద టాండేల్ సినిమా దేశభక్తి అంశాలతో ముడివేసి భావోద్వేగమైన ప్రేమకథ. సినిమా చూస్తున్నంత సేపూ ఆ ఫీల్ ఉంటుంది. మరికొంత స్క్రీన్ ప్లే మీద వర్క్ చేసి ఉంటె బాగుండు అనిపించినా తండేల్ ఒక మంచి ప్రేమకథా చిత్రంగా మనస్సులో నిలిచిపోతుందని చెప్పవచ్చు. ప్రేమ కథలను ఇష్టపడే వారికి సినిమా బాగా రీచ్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *