TGSRTC

TGSRTC: తెలంగాణలో ‘ఆర్టీసీ’ సమ్మె సైరన్.. అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్?

TGSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కార్మికులు మరోసారి పోరాట బాట పట్టారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల పరిష్కారం కోసం నేడు (ఏప్రిల్ 21) అర్ధరాత్రి నుంచే సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. అన్ని ప్రధాన కార్మిక సంఘాలు ఏకతాటిపైకి రావడంతో బుధవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదం నెలకొంది.

ప్రధాన డిమాండ్లు ఇవే:

ఆర్టీసీ జేఏసీ నాయకులు ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి, హనుమంతు ముదిరాజ్ ఇంకా అశ్వథ్థామరెడ్డి వర్గాలు ప్రధానంగా నాలుగు అంశాలపై పట్టుబడుతున్నాయి:

  1. ప్రభుత్వంలో విలీనం: ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రభుత్వ విభాగంగా గుర్తించాలి.

  2. యూనియన్ల పునరుద్ధరణ: కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించి, యూనియన్లకు గుర్తింపునివ్వాలి.

  3. పీఆర్‌సీ అమలు: రెండో వేతన సవరణ (PRC) వెంటనే అమలు చేయాలి.

  4. బకాయిల చెల్లింపు: విశ్రాంత ఉద్యోగులకు అందాల్సిన సెటిల్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి.

60 లక్షల మందిపై ప్రభావం.. ‘మహాలక్ష్మి’కి బ్రేక్?

ఆర్టీసీ సమ్మె గనుక జరిగితే రాష్ట్రవ్యాప్తంగా నిత్యం ప్రయాణించే 60 లక్షల మంది ప్రయాణికులు రోడ్డున పడే అవకాశం ఉంది.

  • మహిళల ఇబ్బందులు: ముఖ్యంగా ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా ప్రతిరోజూ ఉచితంగా ప్రయాణించే సుమారు 35 లక్షల మంది మహిళలకు ఈ సమ్మె పెద్ద ఇబ్బందిగా మారనుంది.

  • స్తంభించనున్న వ్యవస్థ: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10 వేల బస్సులు డిపోలకే పరిమితమైతే, పాఠశాలలు, కళాశాలలు మరియు కార్యాలయాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ప్రభుత్వం ఏమంటోంది? ప్రతిష్టంభన తొలిగేనా?

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వ్యవహారంపై సానుకూలంగా స్పందించారు. ఆర్టీసీ అనేది పేద ప్రజల లైఫ్ లైన్ అని, దానిని ఆగిపోనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. “మెజారిటీ డిమాండ్లపై మాకు సానుకూలత ఉంది. అయితే విలీనం వంటి కీలక నిర్ణయాల కోసం ఆర్థిక శాఖ కసరత్తు చేయాల్సి ఉంటుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఆయన ఈరోజు చెన్నై నుంచి రాగానే జేఏసీ నేతలతో మరో విడత చర్చలు జరిపి సమ్మెను నివారిస్తాం” అని మంత్రి భరోసా ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *