TGSRTC: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త అందించింది. 2.5% డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపును ప్రకటించింది. ఈ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. డీఏ పెంపుతో ఆర్టీసీపై ప్రతి నెల రూ.3.6 కోట్ల అదనపు భారం పడనుందని ఆయన తెలిపారు.
ఇక, మహిళా సాధికారతకు తోడ్పడేలా ‘ఇందిరా మహిళా శక్తి’ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద మొత్తం 600 ఆర్టీసీ బస్సులను మహిళా సమైక్య సంఘాలకు అద్దెకు ఇవ్వనున్నారు. మొదటి దశలో 150 బస్సులను రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ బస్సులను మండల మహిళా సమైక్య సంఘాల ద్వారా కొనుగోలు చేసి, ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
మహిళా సాధికారత లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాలను ఆర్థికంగా స్వయంసమృద్ధిగా మార్చేందుకు బస్సుల అద్దె విధానాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా మహిళా సంఘాలను బస్సుల యజమానులుగా మార్చి, ఆదాయ ఆర్జనకు వీలు కల్పించింది. పాత ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
Also Read: Yadagirigutta: యాదగిరిగుట్టకు స్వయం ప్రతిపత్తి.. టీటీడీ తరహాలో ఆలయ బోర్డు
TGSRTC: మహిళా ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నందున, ఈ బస్సుల ద్వారా వారి ప్రయాణ అవసరాలు సులభతరం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి 150 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీనివల్ల ఆర్టీసీ బస్సులకు భారీ డిమాండ్ ఏర్పడిందని, ఈ కొత్త పథకం ద్వారా ఆ అవసరాలను తీర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ పథకం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన పెరుగుతుందని, అదే సమయంలో ప్రయాణికుల కోసం మెరుగైన సేవలు అందించగలమని తెలంగాణ ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది.