Water Problem

Water Problem: ₹50 లక్షల బిల్లులు పెండింగ్.. తెలంగాణ సచివాలయంలో మంచినీటి సరఫరా నిలిపేసిన ఏజెన్సీలు..

Water Problem: రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ వంటి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో (TG Secretariat) వింత పరిస్థితి నెలకొంది. నిత్యం వేలాది మంది అధికారులు, ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే సందర్శకులతో రద్దీగా ఉండే సచివాలయంలో గత కొన్ని రోజులుగా తీవ్ర మంచినీటి కొరత ఏర్పడింది. తాగునీటి సరఫరా బిల్లులు భారీ మొత్తంలో పేరుకుపోవడంతో, నీటిని అందించే ఏజెన్సీలు సరఫరాను పూర్తిగా నిలిపివేశాయి. దీంతో గుక్కెడు నీటి కోసం ఉద్యోగులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

₹50 లక్షల బకాయిలు – చేతులెత్తేసిన ఏజెన్సీలు..

సచివాలయంలో రోజువారీ తాగునీటి అవసరాల కోసం నాలుగు ప్రధాన ప్రైవేట్ ఏజెన్సీలు నీటిని సరఫరా చేస్తుంటాయి. ఈ ఏజెన్సీలకు ప్రభుత్వం నుంచి సుమారు రూ. 50 లక్షల మేర బకాయిలు రావాల్సి ఉంది. సచివాలయ పరిధిలోని ఒక్కో ప్రభుత్వ శాఖ (డిపార్ట్‌మెంట్) నుంచే లక్షల రూపాయల చొప్పున బిల్లులు నెలల తరబడిగా క్లియర్ కాకుండా నిలిచిపోయాయి. పలుమార్లు అధికారులకు విన్నవించినా, బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో విసిగిపోయిన ఏజెన్సీలు కఠిన నిర్ణయం తీసుకున్నాయి. బకాయి పడ్డ పూర్తి మొత్తాన్ని తక్షణమే విడుదల చేస్తే తప్ప మంచినీటిని సరఫరా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెబుతూ నీటి తోటలను, క్యాన్ల సరఫరాను పూర్తిగా బంద్ చేసేశాయి.

“ఇంటి నుంచే బాటిళ్లు తెచ్చుకోండి” – అధికారుల వింత ప్రతిపాదన..

తాగునీటి సరఫరా ఆగిపోవడం, ఉన్నతాధికారుల నుంచి నిధులు విడుదల కాకపోవడంతో సచివాలయ అధికారులు చేతులెత్తేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేవరకు ఉద్యోగులు, సిబ్బంది ఎవరికి వారే తమ ఇళ్ల నుంచి లేదా బయట కొనుగోలు చేసి మంచినీటి బాటిళ్లను తెచ్చుకోవాలని అంతర్గతంగా సూచించినట్లు సమాచారం.మరోవైపు సచివాలయ ప్రాంగణంలో, వివిధ బ్లాకుల్లో ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్లు, వాటర్ కూలర్లు చాలాకాలంగా నిర్వహణ లేక పనిచేయడం ఆగిపోయాయి. దీంతో అర్జీలు ఇవ్వడానికి, పనుల కోసం సచివాలయానికి వచ్చే సాధారణ ప్రజలకు కనీసం గొంతు తడుపుకునే అవకాశం కూడా లేకుండా పోయింది.

ఇప్పటికే నిలిచిపోయిన లంచ్ – ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి:

మంచినీటి సమస్య ఒక్కటే కాదు.. సచివాలయంలో సమస్యలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంపై ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తమవుతోంది.సచివాలయంలో సిబ్బందికి అందించే మధ్యాహ్న భోజన (లంచ్) సదుపాయం కూడా పెండింగ్ బిల్లులు, నిర్వహణ లోపాల వల్ల కొద్దిరోజుల క్రితమే నిలిచిపోయింది.

ఇప్పుడు దానికి తోడు ప్రాథమిక అవసరమైన తాగునీటిని కూడా అందించలేకపోవడంపై ఉద్యోగ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. “రాష్ట్రానికే తలమానికమైన సచివాలయంలోనే ఇలాంటి దుస్థితి ఉంటే, క్షేత్రస్థాయి కార్యాలయాల పరిస్థితి ఏమిటి?” అని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, ఆర్థిక శాఖ తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న రూ. 50 లక్షల బిల్లులను వెంటనే విడుదల చేయాలని, తాగునీటి సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *