Chandrababu

Chandrababu: నేను 2019 సీఎంను కాదు.. చంద్రబాబు 4.0! గొడ్డలి పార్టీ తోక తిప్పితే తొక్కిపడేస్తాం

Chandrababu: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్‌సీపీపై నిప్పులు చెరిగారు. “నేను 2019 నాటి సీఎంను కాదు.. చంద్రబాబు 4.0! తప్పు చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు.. గొడ్డలి పార్టీ తోక తిప్పితే తొక్కిపడేస్తాం!” అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రొద్దుటూరులో ఎన్నడూ చూడని రీతిలో ప్రజల నుంచి వెల్లువెత్తిన ఉత్సాహం మధ్య మాట్లాడిన ఆయన.. రాయలసీమ అభివృద్ధిపై స్పష్టమైన బ్లూప్రింట్‌ను ఆవిష్కరించడంతో పాటు, గత పాలకుల విధ్వంసం, నేర రాజకీయాల చిట్టాను విప్పారు. ఈ వయసులోనూ మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి గారు ఎంతో దృఢంగా, పట్టుదలతో నిలబడటం అభినందనీయమని చంద్రబాబు కొనియాడారు.

కడప నుంచే సవాల్ విసురుతున్నా.. ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి!

గత ప్రభుత్వం కేంద్ర నిధులను రాబట్టడంలో ఘోరంగా విఫలమైందని చంద్రబాబు లెక్కలతో సహా నిలదీశారు.
కేంద్ర నిధుల కేటాయింపుల్లో నిర్లక్ష్యం
“యూపీ ప్రభుత్వం కేంద్రం నుంచి రూ.లక్ష కోట్లు తెచ్చుకుంది. మనకంటే చిన్న రాష్ట్రమైన అసోం రూ.34 వేల కోట్లు రాబట్టుకుంది. కానీ గత ఏపీ ప్రభుత్వం సాధించింది కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే! ఇది గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట కాదా?” అని ప్రశ్నించారు.

 

రూ.30,156 కోట్లతో జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార..
తాము అధికారంలోకి రాగానే రూ.30,156 కోట్లతో జల్ జీవన్ మిషన్ పనులకు శ్రీకారం చుట్టామని, ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా స్వచ్ఛమైన నీటిని అందిస్తామని చెప్పారు. ప్రజలు నీళ్లు తాగే ప్రతిసారీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని స్మరించుకునేలా ఈ ప్రాజెక్టుకు నామకరణం చేస్తామన్నారు.

 

పల్లె పండుగ 3.0 & పేదలకు ఇళ్లు..
రూ.11 వేల కోట్లతో పల్లె పండుగ 3.0 ప్రారంభించి గ్రామీణ మౌలిక వసతులు మారుస్తున్నామని, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహకారంతో ఇప్పటికే 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, మరో 6 లక్షల ఇళ్లకు కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి జాగా, శాశ్వత అడ్రస్ ఉండాలన్నదే కూటమి సంకల్పమన్నారు.

వివేకా హత్యలో ₹40 కోట్ల సుపారీ.. అసలు నిజాలు కక్కిస్తాం!

“వైఎస్ వివేకానందరెడ్డిని చంపేందుకు ఏకంగా రూ.40 కోట్ల సుపారీ ముట్టిందనే వాస్తవాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ హత్యలో, మద్యం కుంభకోణంలో దోచేసిన వేల కోట్ల రూపాయల్లో అంతిమ లబ్ధిదారు ఎవరో అందరికీ తెలిసిపోయింది. ఆ దొంగల వేళ్లన్నీ గొడ్డలి పార్టీ అధినేత వైపే చూపిస్తున్నాయి. అన్ని నిజాలనూ బయటకు కక్కిస్తాం” అని స్పష్టం చేశారు.

 

గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు
“గత ప్రభుత్వంలో గ్రూప్-1 జవాబు పత్రాలను సైతం అటెండర్లు, ఎలక్ట్రీషియన్లతో దిద్దించి కలెక్టర్లు, ఆర్డీవోలు కావాల్సిన నిరుద్యోగ యువత జీవితాలను నాశనం చేశారు. ఇసుక, మద్యం, భూ దందాల్లో అడ్డగోలుగా దోచుకున్నారు.”

 

నేరాలు చేయడం.. ఎదుటివారిపై నెట్టడం
“సింగయ్యను కారు కింద తొక్కించడం నుంచి మాజీ మంత్రి కొడుకు యాక్సిడెంట్ కేసును తప్పించడం వరకు.. నేరాలు చేసి ఎదుటివారిపై రుద్దడం ఆ పార్టీ డీఎన్ఏలోనే ఉంది. మతమార్పిడులను ప్రోత్సహిస్తూ హింసా రాజకీయాలే అజెండాగా బతికారు. అందుకే 2024 ఎన్నికల్లో కడప గడ్డతో సహా రాష్ట్ర ప్రజలు గొడ్డలి పార్టీకి చెంపదెబ్బ కొట్టారు. అసెంబ్లీలో 10 శాతం సీట్లు కూడా గెలవలేని వాళ్లకు ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదు.. నేనెలా ఇస్తాను?” అని ఎద్దేవా చేశారు.

గోదావరి పుష్కరాల ముందే పోలవరం పూర్తి – ప్రధాని మోదీతో జాతికి అంకితం..

ఇలాంటి కరువు సమయంలోనూ దాదాపు 2,000 టీఎంసీల గోదావరి జలాలు సముద్రం పాలయ్యాయని, గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంతో నాలుగు రాష్ట్రాల సాగునీటి కష్టాలను తీరుస్తామని, తెలుగు తల్లికి జలహారతి ఇస్తామని పేర్కొన్నారు.

 

పోలవరం ప్రాజెక్టు..
రాబోయే గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసి, స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
సీమ బిడ్డను.. రాయలసీమను ‘గోల్డ్ మైన్’గా మారుస్తా!..
“నేను కూడా రాయలసీమలోనే పుట్టి పెరిగిన సీమ బిడ్డను. శ్రీకృష్ణదేవరాయలు పాలించిన వైభవాన్ని సీమకు మళ్లీ తీసుకొస్తా. మదనపల్లెలో ఏర్పాటు చేస్తున్న మెగా హార్టీకల్చర్ హబ్ సీమ దశ-దిశను మారుస్తుంది. జొన్నగిరి గోల్డ్ మైన్‌గా రూపుదిద్దుకుంటోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైకులు తయారుచేసే ప్రాజెక్టు సీమకే రాబోతోంది. భవిష్యత్తులో దేశ రక్షణ రంగానికి అవసరమైన ఫైటర్ జెట్లు ‘మేడ్ ఇన్ రాయలసీమ’ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకెళ్తాం.”

 

రప్పారప్పా రాజకీయాలు వద్దు:
“సీమ ప్రజలకు కావాల్సింది రప్పారప్పా ఫ్యాక్షన్ రాజకీయాలు, గొడ్డలి పోట్లు కాదు.. శాంతి, నీళ్లు, ఉద్యోగాలు, అభివృద్ధి! ఎన్ని కుట్రలు పన్నినా ‘రాయలసీమ రైజింగ్’ను ఎవరూ ఆపలేరు.”

 

పాలనలో సాంకేతికత:

అధికారులు ‘కర్మయోగి’ ప్లాట్‌ఫామ్ ద్వారా నైపుణ్యాలు పెంచుకోవాలని, ప్రజలకు పాలన మరింత సులభతరం చేసేందుకు ఒక్క వాట్సాప్ ద్వారానే 50 రకాల ప్రభుత్వ సేవలను త్వరలోనే అందుబాటులోకి తెస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *