Wine Shops Closed: తెలంగాణలోని మద్యం బాబులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన ఎక్సైజ్ శాఖ. రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు (సోమవారం) సాయంత్రం నుంచి రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటు తెలిపింది.
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా, సోమవారం సాయంత్రం ప్రచారం ముగిసినప్పటి నుంచి ఫిబ్రవరి 11 (బుధవారం) సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘డ్రై డే’ (Dry Day) అమల్లో ఉండనుంది.
సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి వైన్స్ బంద్ కానున్నాయి. విటితో పాటు హోటళ్లు, రెస్టారెంట్లలో ఉండే బార్లు కూడా ఈ రెండు రోజులు మద్యం సరఫరా చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. తిరిగి ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాతే దుకాణాలు తెరువనున్నారు.
కఠిన చర్యలు తప్పవు
ఎన్నికల సమయంలో అక్రమంగా మద్యం రవాణా చేసినా లేదా నిబంధనలు ఉల్లంఘించి దొడ్డిదారిలో మద్యం విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మద్యం దుకాణాల వద్ద నిరంతరం నిఘా ఉంచేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బెల్ట్ షాపులపై కూడా దాడులు నిర్వహించి అక్రమ నిల్వలను సీజ్ చేయాలని ఎక్సైజ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.
ముందస్తుగా నిల్వ చేసుకుంటున్న మందుబాబులు
రెండు రోజుల పాటు వైన్ షాపులు మూతపడతాయన్న వార్తతో చాలా ప్రాంతాల్లో మందుబాబులు ముందుగానే షాపుల వద్ద క్యూ కట్టారు. తమకు కావాల్సిన స్టాక్‌ను ఇప్పుడే కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. దీనివల్ల ఈరోజు మధ్యాహ్నం నుంచే వైన్ షాపుల వద్ద రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.
సాధారణంగా ఎన్నికల సమయంలో గొడవలు జరగకుండా ఉండేందుకు, ఓటర్లను ప్రభావితం చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటుంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసే వరకు ఈ ఆంక్షలు కఠినంగా అమలు కానున్నాయి.
