Harish Rao: తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య సాగుతున్న పొలిటికల్ సవాళ్లు ఉత్కంఠ రేపుతున్న తరుణంలో.. హైదరాబాద్ గన్ పార్క్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర అప్పులు, గురుకులాల టెండర్లలో అవినీతి ఆరోపణలపై చర్చించేందుకు అమరవీరుల స్థూపం వద్దకు రావాలంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విసిరిన సవాల్‌ను స్వీకరించి బయల్దేరిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అడ్డుకోవడంతో ఈ హైడ్రామా చోటుచేసుకుంది.
మంత్రుల ఆహ్వానం మేరకు హరీష్ రావు తన అనుచరులు, పార్టీ శ్రేణులతో కలిసి తెలంగాణ భవన్ నుండి గన్ పార్క్ వైపు ప్రయాణమయ్యారు. అయితే, శాంతిభద్రతల దృష్ట్యా ఈ చర్చకు ముందస్తు అనుమతి లేకపోవడంతో పోలీసులు ఆయన వాహనాన్ని మధ్యలోనే అడ్డుకున్నారు.
చర్చకు రావాలని ముగ్గురు మంత్రులు స్వయంగా పిలిస్తేనే వెళ్తున్నానని, తనను ఎందుకు ఆపుతున్నారని హరీష్ రావు పోలీసులతో వాదించారు. కావాలంటే గన్ పార్క్ వద్ద వేచి చూస్తున్న మంత్రులకు ఫోన్ చేసి అడగాలని సూచించారు.
తామేం ఇక్కడ గొడవలు పడటానికి వెళ్లడం లేదని, కేవలం ప్రజల పక్షాన, దళితుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రజాస్వామ్యయుతంగా వెళ్తున్నామని స్పష్టం చేశారు. తమ వద్ద కొండా సురేఖ రాసిన లేఖ, హైకోర్టు ఉత్తర్వులు, ఇంకా టెండర్ల కేటాయింపులకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు.
తోపులాట.. హరీష్ రావు అరెస్ట్
పోలీసులు వాహనాలను ముందుకు వెళ్లనివ్వకపోవడంతో, హరీష్ రావు కారు దిగి కాలినడకన గన్ పార్క్ వైపు వెళ్లడానికి నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య ఒక్కసారిగా తోపులాట జరిగింది.
