Telangana: సర్కారు వేతనాలు సరిపోను అందుతున్నా.. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలకు మరిగి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. అక్రమాలకు పాల్పడి ఎందరో ఉద్యోగులు సస్పెన్షన్ అయినా, ఉన్నవారిలోనూ బుద్ధిరావడం లేదు. దేశానికి వెన్నెముకగా పిలుచుకునే కాయకష్టం చేసే రైతన్నలనూ పీడిస్తూ లంచాలు వసూలు చేస్తున్న వైనంపై సభ్యసమాజం భగ్గుమంటున్నది. ఇటీవలే రెండు చోట్ల రైతుల నుంచి అక్రమంగా డబ్బు తీసుకుంటూ ఏసీబీకి అధికారులు పట్టుబడిన ఘటనలపై విస్మయం కలుగుతున్నది.
Telangana: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఓ రైతు వద్ద నాలా కన్వర్షన్ చేసేందుకు రూ.75 వేలు లంచం తీసుకుంటూ మొన్ననే ఆర్డీవో సీసీ ఏసీబీకి పట్టుబడ్డాడు. రెడ్‌హ్యాండెండ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకోగానే వలవల ఏడుస్తూ తప్పయిందని బాధపడ్డాడు. తాజాగా వికారాబాద్ జిల్లాలో ఓ ఇద్దరు అధికారులు రైతులనూ వదలలేదు. తీరా ఏసీబీకి పట్టుబడ్డారు.
Telangana: వికారాబాద్ జిల్లా దుద్యాల మండల కేంద్రంలోని 6.26 ఎకరాల పట్టా భూమి స్వభావాన్ని మార్చేందుకు ఓ రైతు నుంచి తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవో దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్‌రావు రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భూమి స్వభావాన్ని మార్చేందుకే రూ.5 లక్షలు డిమాండ్ చేయడం వారి అంతులేని అవినీతికి నిదర్శనంగా నిలుస్తున్నది. ఇలాంటి ఉద్యోగుల వల్ల ఉద్యోగ వర్గానికే చెడ్డపేరు వచ్చేలా ఉన్నది. అందరూ ఇలాంటి వారేనా అన్న అనుమానం కలిగేలా ఈ లంచావతారులు వ్యవహరిస్తుండటం గమనార్హం. రైతులనూ లంచాల బారి నుంచి వదలకపోవడంపై విస్మయం వ్యక్తమవుతున్నది.