DA Hike: తెలంగాణ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. డిప్యూటీ సీఎం మరియు విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క 2 శాతం డీఏ (డియర్ అలవెన్స్) పెంపును శుక్రవారం ప్రకటించారు. ఈ పెంపు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధిపొందనున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “విద్యుత్ ఉద్యోగులు మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాం. విద్యుత్ రంగం దేశానికి మార్గదర్శిగా నిలవాలి. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలి,” అని అన్నారు.
భట్టి విక్రమార్క ప్రజా భవన్‌లో జరిగిన డీఏ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రాన్స్‌కో మేనేజ్‌మెంట్, డిస్కంల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. డీఏ పెంపు ప్రకటన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు, జేఏసీ నేతలు, ట్రాన్స్‌కో యాజమాన్యం డిప్యూటీ సీఎంను అభినందించారు.
ఇది కూడా చదవండి: Crime News: మైలవరం పిల్లల హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
ఈ డీఏ పెంపుతో ఉద్యోగుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. కారుణ్య నియామకాలకు సంబంధించి జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం 18 మందికి నియామక పత్రాలు అందించారు. వీరిలో 7 మంది రెగ్యులర్, 11 మంది ఆర్టిజన్ హోదాలో ఉద్యోగాలను పొందారు.
ఇటీవల ఖమ్మంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ అంబులెన్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న భట్టి విక్రమార్క, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు.
ఈ నిర్ణయంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తీసుకున్న ఈ సానుకూల నిర్ణయం తమ సంక్షేమానికి పునాది వేస్తుందని అభిప్రాయపడ్డారు.