Telangana: హాస్టళ్లు, కాలేజీల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. స్నానపు గదుల్లో, యువతుల గదుల్లో సీక్రెట్ కెమెరాలు ఉంచి, యువతుల వీడియోలను సోషల్ మీడియా వేదికలకు అమ్ముకుంటున్న వైనం ఇటీవలే ఏపీలో వెలుగు చూసింది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కళాశాలలోనూ ఇదే సీక్రెట్ కెమెరాల దురాఘతం బయటపడింది.
Telangana: తాజాగా మహిళా దినోత్సవం రోజే తెలంగాణలో మరో ఘటన వెలుగు చూసింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేటలోని మహిళా హాస్టల్‌లో స్పై కెమెరాలు పెట్టిన ఘటన కలకలం రేపింది. హాస్టల్ నిర్వాహకుడు ఫోన్ చార్జర్లలో స్పై కెమెరా పెట్టినట్టు కొందరు యువతులు గుర్తించారు.
Telangana: ఈ మేరకు ఆ యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వచ్చి విచారణ చేపట్టారు. ఫోన్ చార్జర్లను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసి స్పై కెమెరాలోని డేటాను పరిశీలిస్తున్నట్టు పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు.
Telangana: మహిళా దినోత్సవం రోజే మహిళల మానాలను అంగడిలో అమ్మే దురాఘతానికి ఒడిగట్టేందుకు పాల్పడే ఈ ఘటన చోటుచేసుకోవడంపై మహిళా లోకం నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు మహిళలు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్రంలోని అన్ని మహిళా హాస్టళ్లలో తనిఖీలు చేయాలని, యువతులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.