RCB 2026 IPL Champions: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసి ఆర్సీబీ ఛాంపియన్‌గా అవతరించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన బెంగళూరు.. ఈ అద్భుత విజయంతో ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండుసార్లు టైటిల్ గెలిచిన మూడో జట్టుగా రికార్డు సృష్టించింది. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ (2010, 2011), ముంబై ఇండియన్స్ (2019, 2020) మాత్రమే ఈ ఘనత సాధించగా, ఇప్పుడు ఆర్సీబీ ఆ దిగ్గజాల సరసన చేరింది.
టాస్ గెలిచిన ఆర్సీబీ.. కుప్పకూలిన గుజరాత్ బ్యాటింగ్!
ఈ హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిజం చేస్తూ ఆర్సీబీ బౌలర్లు పదునైన బంతులతో గుజరాత్ బ్యాటర్లను వణికించారు. జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ చెలరేగడంతో గుజరాత్ టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. సాయి సుదర్శన్ (12), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (10)లు త్వరగానే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత ప్రమాదకరమైన జోస్ బట్లర్ (19)ను కృనాల్ పాండ్యా అద్భుతంగా స్టంప్ అవుట్ చేసి గుజరాత్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు.
ఆరో స్థానంలో వచ్చిన అర్షద్ ఖాన్ 2 సిక్సర్లతో 15 పరుగులు చేసి హేజిల్‌వుడ్‌కు దొరికిపోయాడు. రాహుల్ తెవాటియా (7), జాసన్ హోల్డర్ (7), రషీద్ ఖాన్ (7)లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అయితే, ఒకవైపు వికెట్లు పడుతున్నా వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటం చేశాడు. ఆర్సీబీ బౌలర్లను ఎదుర్కొంటూ 37 బంతుల్లో 5 ఫోర్లతో అజేయంగా 50 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
-
ఆర్సీబీ బౌలింగ్: రసిక్ సలాం 27 పరుగులిచ్చి 3 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేయగా, భువనేశ్వర్ కుమార్ (2/29), జోష్ హేజిల్‌వుడ్ (2/37) రెండేసి వికెట్లు పడగొట్టారు.
మెరుపు ఆరంభం.. ఆపై మిడిలార్డర్ వికెట్ల పతనం
156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు. తొలి వికెట్‌కు కేవలం కొన్ని ఓవర్లలోనే 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వెంకటేష్ అయ్యర్ 16 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసి మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే, ఆ తర్వాత ఆర్సీబీ ఇన్నింగ్స్ కాస్త తడబడింది. దేవదత్ పడిక్కల్ (1) రబాడా బౌలింగ్‌లో వెనుదిరగగా.. కెప్టెన్ రజత్ పాటిదార్ (15), కృనాల్ పాండ్యా (0)లను రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో అవుట్ చేసి మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చాడు.
ఆ దశలో క్రీజులోకి వచ్చిన టిమ్ డేవిడ్.. కింగ్ కోహ్లీకి అండగా నిలిచాడు. ఐదో వికెట్‌కు వీరిద్దరు 41 పరుగులు జోడించారు. టిమ్ డేవిడ్ 17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 24 పరుగులు చేసి, జట్టు గెలుపునకు 25 పరుగులు అవసరమైన సమయంలో అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
కింగ్ కోహ్లీ వన్-మ్యాన్ షో.. మ్యాచ్ ఫినిష్ చేసిన జితేష్!
ఒకవైపు వికెట్లు పడుతున్నా.. స్టేడియం మొత్తం ‘కోహ్లీ.. కోహ్లీ..’ అనే నినాదాలతో మారుమోగుతుండగా విరాట్ కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఫైనల్ మ్యాచ్ ప్రెజర్‌ను తట్టుకుంటూ 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 75 పరుగులు చేసి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. అతనికి తోడుగా జితేష్ శర్మ (14 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడాడు. కోహ్లీ-జితేష్ జోడీ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఆర్సీబీ క్యాంప్‌లో గెలుపు సంబరాలు అంబరాన్ని తాకాయి.
-
గుజరాత్ బౌలింగ్: రషీద్ ఖాన్ 25 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా.. రబాడా, సిరాజ్, అర్షద్ ఖాన్లు తలో వికెట్ పడగొట్టారు.
