TG Assembly: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి తెరలేవనుంది. రాష్ట్రంలో ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల వేడి తగ్గకముందే, అటు పాలన.. ఇటు రాజకీయ వ్యూహాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. కృష్ణా, గోదావరి జలాల వివాదాలు, సాగునీటి ప్రాజెక్టులు మరియు గ్రేటర్ హైదరాబాద్ విస్తరణే ప్రధాన ఎజెండాగా ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులతో సుదీర్ఘంగా సమావేశమైన సీఎం, రానున్న రోజుల్లో ప్రభుత్వ కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
1. సాగునీటి ప్రాజెక్టులపై ‘శ్వేతపత్రం’ తరహా చర్చ
గత ప్రభుత్వ హయాంలో సాగునీటి రంగంలో జరిగిన వ్యయం, నీటి కేటాయింపుల్లో జరిగిన జాప్యంపై అసెంబ్లీలో ‘నీళ్లు- నిజాలు’ పేరుతో చర్చ జరపాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది.
రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసిన నిధులు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం. ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులు, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై గట్టిగా గళం విప్పాలని ముఖ్యమంత్రి మంత్రులకు సూచించారు.
2. మూడు నగరాలుగా ‘మహా నగరం’?
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. జీహెచ్‌ఎంసీ పరిధిని విస్తరిస్తూ, నగరాన్ని మూడు నగరపాలక సంస్థలుగా విభజించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
సైబరాబాద్ పేరుతో కొత్త మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.కొత్తగా 70-80 డివిజన్లతో ఒక్కో కార్పొరేషన్‌ను ప్రారంభించి, భవిష్యత్తులో వాటిని 100కు పెంచాలనేది ప్లాన్. దీనిపై త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Revanth Reddy: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు: 29 నుంచి అసెంబ్లీ.. GHMC విస్తరణపై భారీ స్కెచ్!
3. పంచాయతీ జోష్.. జడ్పీటీసీ, ఎంపీటీసీపై గురి!
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ‘క్లీన్ స్వీప్’ చేయాలని మంత్రులను ఆదేశించారు.
గెలిచిన సర్పంచులను మూడు బృందాలుగా విభజించి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. సంక్రాంతి నాటికి హైదరాబాద్‌లో సర్పంచులతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని యోచిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కొందరు చేసిన పొరపాట్లు వచ్చే ఎన్నికల్లో పునరావృతం కావొద్దని ఇన్ఛార్జ్ మంత్రులను ముఖ్యమంత్రి హెచ్చరించారు.
4. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు?
వచ్చే ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఓటర్ల జాబితా సవరణ పూర్తయిన వెంటనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
మొత్తానికి, ఈ నెల 29న ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు అటు ఇరిగేషన్ ప్రాజెక్టుల వివాదాలతో, ఇటు నగర విస్తరణ బిల్లులతో వాడివేడిగా సాగనున్నాయి. జనవరి 2 నుంచి సభ పూర్తిస్థాయిలో బిల్లులపై చర్చించే అవకాశం ఉంది.
