Revanth Reddy 

Revanth Reddy: కేసీఆర్ క్షమాపణ చెప్పాలి.. తాతా మధు సభ్యత్వం రద్దు చేయాలి..!

Revanth Reddy: తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు. సభాపతి స్థానాన్ని కించపరిచేలా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండించిన ఆయన, తెలంగాణ ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఏ నిర్ణయమైనా సభలో చర్చలు జరిగిన తర్వాతే ఉంటుందని, శాసనసభ, లోక్‌సభ సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత సభలోని ప్రతి సభ్యుడిపై ఉందని స్పష్టం చేశారు. గతంలో విద్యుత్, ధరణి, కాళేశ్వరం ప్రాజెక్టుల వంటి కీలక అంశాలపై సభలోనే సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే తాము విచారణలకు ఆదేశించామని సీఎం గుర్తుచేశారు.

స్పీకర్‌కు జరిగిన అవమానం.. తెలంగాణ ప్రజలకే అవమానం..

సభా హక్కుల పరిరక్షకుడైన స్పీకర్‌ను ఉద్దేశించి సభ్యసమాజం ఏమాత్రం సహించని, తలవంచుకునే రీతిలో అసభ్యకర భాషను ఉపయోగించారని సీఎం మండిపడ్డారు. స్పీకర్‌కు జరిగిన అవమానాన్ని యావత్ సభకు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి జరిగిన గాయంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
“ఒక దళితుడు ఉన్నతమైన సభాపతి స్థానంలో లేదా ప్రతిపక్ష నేతగా ఉండటాన్ని బీఆర్‌ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో దళితులకు ప్రోటోకాల్ లేకుండా అవమానించిన చరిత్ర వారిది. ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా దళితుడిని బర్తరఫ్ చేశారు. ఈ దళిత వ్యతిరేక ఆలోచనలను ఇప్పుడే సరిదిద్దకపోతే రాబోయే తరాలు ఈ సభను క్షమించవు” అని రేవంత్ హెచ్చరించారు.
బీజేపీ సభ్యులకు సభా నాయకుడిగా మాటిస్తున్నా..
 
బీఆర్‌ఎస్ చేసిన అడ్డగోలు తప్పులను, వారిపై ఉన్న అపవాదులను బీజేపీ నేతలు తమ భుజాన ఎందుకు మోస్తున్నారని సీఎం ప్రశ్నించారు. తెరవెనుక ‘చీకటి మిత్రుల’ను కాపాడేందుకు బీజేపీ తాపత్రయపడుతోందని విమర్శించారు. తప్పు చేసిన వారికి తోడుగా నిలబడి బీజేపీ చెడ్డపేరు తెచ్చుకోవద్దని హితవు పలికారు.
చర్చకు ప్రభుత్వం సిద్ధం..
సభా నాయకుడిగా బీజేపీ సభ్యులకు తాను హామీ ఇస్తున్నానని, వారు లేవనెత్తిన ఏ ప్రజా సమస్యపై అయినా సభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. “సభలో మీరు ప్రశ్నించండి.. మేం నిక్కచ్చిగా సమాధానం చెబుతాం. అందరికీ మైక్ ఇస్తాం, అభిప్రాయాలు చెప్పండి” అని స్పష్టం చేశారు.
కేసీఆర్ క్షమాపణ చెప్పాలి.. తాతా మధు సభ్యత్వం రద్దు చేయాలి..
నిన్న ఫామ్‌హౌస్‌లో సమావేశం ఏర్పాటు చేసి నేతలను ఉసిగొల్పి అసెంబ్లీకి పంపారని సీఎం ఆరోపించారు. తాము సంయమనంతో ఉంటే దానిని చేతగానితనంగా భావించవద్దని హెచ్చరించారు. స్పీకర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తక్షణమే తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, సంబంధిత నేతలతో రాజీనామా చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *