YouTuber Madhumitha

YouTuber Madhumitha: ఫేమస్ యూట్యూబర్ మధుమితపై చోరీ కేసు.. 118 సవర్ల చోరీ..

YouTuber Madhumitha: సోషల్ మీడియా, యూట్యూబ్ రీల్స్‌లో ఆడంబరమైన జీవనశైలి, డబ్బు కట్టలు, భారీగా బంగారు ఆభరణాలను ప్రదర్శిస్తూ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న తమిళనాడు ప్రముఖ యూట్యూబర్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌‌ఫ్లుయెన్సర్ మధుమిత మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. వృద్ధుడైన ఒక భవన నిర్మాణ కాంట్రాక్టర్ మెడలోని ఐదు సవర్ల బంగారు గొలుసును దొంగిలించి, ప్రశ్నించినందుకు బెదిరింపులకు పాల్పడిన ఆరోపణలపై ఆమెపై తమిళనాడు పోలీసులు అధికారికంగా కేసు నమోదు చేశారు.

ఇటీవలే ఆమె ఇంట్లో ఏకంగా 118 సవర్ల బంగారం చోరీ కావడం, ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ నిఘా పెట్టిన నేపథ్యంలో.. ఇప్పుడు ఆమెపైనే నేరుగా దొంగతనం కేసు నమోదు కావడం స్థానికంగా సంచలనంగా మారింది.
అసలేం జరిగింది? – 89 ఏళ్ల వృద్ధ కాంట్రాక్టర్ ఫిర్యాదు..
తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా కేటీసీ నగర్ ప్రాంతానికి చెందిన 89 ఏళ్ల పెచ్చిముత్తు వృత్తిరీత్యా బిల్డింగ్ కాంట్రాక్టర్.. నాగర్‌కోయిల్‌లో నివాసముండే యూట్యూబర్ మధుమితతో ఆయనకు గతంలోనే పరిచయం ఉంది. 2022లో పెచ్చిముత్తు తిరునెల్వేలి జిల్లా కోర్టు సమీపంలో తన వాహనంపై వెళ్తుండగా, అక్కడ రోడ్డుపై నిలబడి ఉన్న మధుమిత ఆయనను లిఫ్ట్ అడిగి వాహనం ఎక్కింది.
ఆమెను సమీపంలోని బస్టాప్‌ వద్ద దింపిన తర్వాత పెచ్చిముత్తు తన ఇంటికి చేరుకున్నారు. తీరా ఇంట్లోకి వెళ్లి చూసుకోగా.. తన మెడలో ఉండాల్సిన సుమారు 5 సవర్ల (దాదాపు 40 గ్రాములు) బంగారు గొలుసు కనిపించకుండా పోయింది.
వాహనంలో ఆమె ఒక్కతే ప్రయాణించినందున, వెంటనే మధుమితకు ఫోన్ చేసి తన గొలుసు విషయమై ప్రశ్నించారు. అయితే అందుకు ఆమె తీవ్రంగా స్పందిస్తూ.. “ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పినా, పోలీసుల వద్దకు వెళ్లినా సమాజంలో పరువు తీసి తీవ్రంగా అవమానిస్తా” అంటూ బెదిరించినట్లు బాధితుడు పేర్కొన్నారు. దీంతో భయాందోళన చెందిన బాధితుడు ఎట్టకేలకు రాజాక్కమంగళం పోలీసులను ఆశ్రయించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
రీల్స్‌లో డబ్బులు, బంగారంతో హంగామా..
నాగర్‌కోయిల్‌లో కుటుంబంతో కలిసి ఉండే మధుమిత యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో లక్షలాది మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు. ఆమె సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసే వీడియోలు అత్యంత విలాసవంతంగా ఉంటాయి. రకరకాల దుస్తులు, ఒంటి నిండా కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు ధరించడం, చేతుల్లో పెద్ద పెద్ద నోట్ల కట్టలను పట్టుకుని గాల్లోకి విరజిమ్ముతూ రీల్స్ చేయడం ఆమెకు అలవాటు.ఈ తరహా హంగామా వీడియోలతోనే ఆమె అనతికాలంలోనే విస్తృత ప్రచారం, వ్యూస్ దక్కించుకున్నారు.
రీసెంట్‌‌గా ఆమె ఇంట్లోనే 118 సవర్ల దోపిడీ – రంగంలోకి ఐటీ శాఖ..
మధుమిత జీవితంలో గత కొద్ది రోజులుగా వరుస ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. సెప్టెంబర్ 24న మధుమిత తన భర్త, పిల్లలతో కలిసి బయటకు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని దుండగులు ఆమె ఇంటి తాళాలు పగలగొట్టి ఏకంగా 118 సవర్ల (దాదాపు 944 గ్రాములు) బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.

 

ఆదాయపు పన్ను శాఖ కన్ను..
సోషల్ మీడియాలో విచ్చలవిడిగా డబ్బు, నగలు ప్రదర్శించడం.. ఆపై ఇంట్లో భారీగా దాదాపు కేజీ వరకు బంగారం చోరీకి గురైన ఘటన వెలుగుచూడటంతో ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు సైతం ఆమె ఆదాయ వనరులు, ఆస్తులపై లోతైన విచారణ ప్రారంభించారు.

ఓవైపు ఐటీ శాఖ దర్యాప్తు కొనసాగుతుండగానే, మరోవైపు వృద్ధుడి బంగారు గొలుసు కొట్టేసిందన్న అభియోగంపై రాజాక్కమంగళం పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయడంతో మధుమిత చిక్కుల్లో పడ్డారు. పోలీసులు త్వరలోనే ఆమెను విచారించి తదుపరి చర్యలు చేపట్టే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *