ap news

Ap News: వైసీపీ క్లీన్‌స్వీప్ టార్గెట్.. ఉండవల్లిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కీలక భేటీ

Ap News: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల (మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలు) ఎన్నికలే లక్ష్యంగా కూటమి అగ్రనేతలు కసరత్తు ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో మంగళవారం అత్యంత కీలకమైన సమావేశం జరిగింది.

ఉదయం సీఎం నివాసానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యా-ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ముగ్గురు నేతలు బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ సుమారు రెండు గంటల పాటు స్థానిక ఎన్నికల వ్యూహాలు, తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు.
వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కకూడదు.. సీట్ల పంపకాలపై స్పష్టత..
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి సాధించిన చారిత్రక విజయాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలనే పట్టుదలతో నేతలు ఉన్నట్లు సమాచారం. పాత శాతం లెక్కలు, పంతాలకు పోకుండా.. క్షేత్రస్థాయిలో ఏ పార్టీకి బలం, ప్రజాదరణ ఉంటే ఆ స్థానాన్ని సదరు పార్టీ అభ్యర్థికే కేటాయించాలని నిర్ణయించారు. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య ఎలాంటి అంతర్గత విభేదాలు రాకుండా సమన్వయంతో సాగాలని నిర్ణయించారు.
గత ఐదేళ్ల పాలనలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన వైఎస్సార్‌సీపీకి ఈ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా దక్కకుండా పూర్తిగా క్లీన్‌స్వీప్ చేయాలని, క్షేత్రస్థాయి వరకు కూటమి శ్రేణులు సమన్వయంతో కలిసి పనిచేసేలా రోడ్‌మ్యాప్ రూపొందించారు.
తొలి దశలో జరగనున్న నగరపాలక సంస్థలు (కార్పొరేషన్లు), పురపాలక సంఘాలు (మున్సిపాలిటీలు) ఎన్నికలపై ప్రధానంగా చర్చలు కేంద్రీకృతమయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో ప్రజలు కూటమికి అనుకూలంగా ఉన్నారని, ఈ ఊపును ఓట్ల రూపంలో మలచుకోవాలని భావిస్తున్నారు.
సమన్వయ కమిటీల ఏర్పాటు..
ఎన్నికల నిర్వహణ, సీట్ల సర్దుబాటులో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా ఉండేందుకు మూడు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేయాలని నేతలు నిర్ణయించారు:
  • రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో సమన్వయ కమిటీలు..
    టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కూడిన జాయింట్ కో-ఆర్డినేషన్ కమిటీలను రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు వెంటనే ఏర్పాటు చేయనున్నారు.
  • అభ్యర్థుల ఎంపికలో వివాదాలు వస్తే ఈ కమిటీలే పరిష్కరించే బాధ్యత తీసుకుంటాయి.

సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే షెడ్యూల్? – కౌంట్‌డౌన్ షురూ..

  • స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) రాబోయే శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.
  • అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పు ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఏ క్షణంలోనైనా మున్సిపల్, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
  • షెడ్యూల్ వచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అభ్యర్థుల ప్రకటన, ప్రచారం మొదలుపెట్టేందుకు వీలుగా కూటమి అధినేతలు ముందస్తుగానే పూర్తిస్థాయి కసరత్తును కొలిక్కి తెచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *