Amaravati: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా, మహిళలకు ప్రత్యేక కానుకగా ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం అమలుకు అవసరమైన నిధులను రేపే (జూన్ 12) విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
67 లక్షల మందికి నేరుగా లబ్ధి
ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం, మొత్తం 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది. తల్లుల ఖాతాల్లో నేరుగా రూ. 8,745 కోట్ల నిధులు జమ చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
అన్ని తరగతులకూ వర్తింపు
ఈ పథకం కేవలం ప్రస్తుత విద్యార్థులకు మాత్రమే కాకుండా, 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరే విద్యార్థుల తల్లులకు కూడా వర్తించనుంది. కొత్తగా అడ్మిషన్ పొందే విద్యార్థుల సమాచారం అందుబాటులోకి వచ్చిన వెంటనే వారి తల్లుల ఖాతాల్లోనూ నిధులు జమ చేయనున్నారు.
మేనిఫెస్టో హామీకి న్యాయం
ఎంత మంది పిల్లలు ఉంటే, అంత మందికి తల్లికి వందనం అమలు చేస్తామన్న ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలపై ప్రభుత్వ ఉత్తర్వులు (జీఓ) నేడు విడుదల కానున్నాయి.
Also Read: UPI Payments: యూపీఐ వినియోగదారులకు షాక్: రూ.3 వేలు దాటితే చెల్లింపులపై ఛార్జీలు?
సూపర్ సిక్స్ హామీల అమలు కొనసాగుతోంది
‘తల్లికి వందనం’ పథకం కూటమి సర్కార్ సూపర్ సిక్స్ హామీలలో ఒకటి. ఇప్పటికే ప్రభుత్వం
పింఛన్ల పెంపు
అన్నా క్యాంటీన్
మెగా డీఎస్సీ
దీపం-2 వంటి పథకాల అమలును ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో, మహిళా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రారంభించనున్న ప్రభుత్వం నిర్ణయం ప్రశంసనీయమని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.