supreme court: హైదరాబాద్‌లోని హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి సర్కార్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ వ్యవహారంపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టుకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.
supreme court: ఒకవైపు రాష్ట్ర హైకోర్టులో ఇదే అంశంపై విచారణ కొనసాగుతున్నది. నిన్న వాద, ప్రతివాదనలు పూర్తికాకపోవడంతో విచారణ ఈ రోజుకు (గురువారానికి) వాయిదా పడింది. ఇదే సమయంలో సుప్రీంకోర్టులో కూడా ఇదే భూముల విషయమై న్యాయ విచారణ జరగడం గమనార్హం. ప్రభుత్వం విక్రయించాలకుంటున్న కంచ గచ్చిబౌలి భూములను పరిశీలించి ఇదే రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు నివేదిక సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్ సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
supreme court: గత 30 ఏండ్లుగా ఆ భూమి వివాదంలో ఉన్నదని, అటవీ భూమి అన్న ఆధారాలు లేవని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ అక్కడి ఒక్క చెట్టునూ నరకవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా, హైకోర్టులో జరిగే ప్రొసిడింగ్స్‌పై సుప్రీంకోర్టు ఎటువంటి స్టే ఇవ్వడం లేదు.
supreme court: హెచ్‌సీయూ భూముల వ్యవహారం మలుపులు తిరుగుతున్నది. ఇప్పటికే హెచ్‌సీయూ విద్యార్థులు, అధ్యాపకులు పోరాటంలో పాల్గొంటుండగా, గురువారం నుంచి బోధనేతర సిబ్బంది కూడా పోరుబాటలో భాగస్వామ్యం అవుతున్నట్టు ప్రకటించారు. విద్యార్థుల పోరాటానికి రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, ఇతర ప్రజా సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి. అదే విధంగా మేధావులు, సినీరంగ ప్రముఖులు ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్నారు. ఇదే రోజు ఇటు హైకోర్టులో, మరోవైపు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున ఎలాంటి ఫలితం వస్తుందోనని అంతటా ఉత్కంఠ నెలకొన్నది.