DK Shivakumar: కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఉత్కంఠకు తెరపడనుంది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చే బుధవారం (జూన్ 3న) ఆయన కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బెంగళూరులోని విధాన సౌధలో కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ కీలక భేటీలో డీకే శివకుమార్‌ను తమ శాసనసభా పక్ష నేతగా ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సిద్ధరామయ్య రాజీనామా.. కొడుక్కి డిప్యూటీ సీఎం పదవి?
కర్ణాటకలో నాయకత్వ మార్పు ఫార్ములాలో భాగంగానే ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ కూడా ఆమోదించారు. పదవికి రాజీనామా చేసిన వెంటనే సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కలిసి కొత్త మంత్రివర్గంలో తన మనుషులకు చోటు కల్పించాలని కోరినట్లు సమాచారం. ముఖ్యంగా తన కుమారుడు, ఎమ్మెల్సీ అయిన డాక్టర్ యతీంద్రకు కీలక శాఖలతో పాటు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆయన గట్టిగా కోరినట్లు టాక్ వినిపిస్తోంది.
కొత్త క్యాబినెట్లో భారీ మార్పులు.. పాత మంత్రులకు షాక్!
డీకే శివకుమార్ నేతృత్వంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంలో మంత్రివర్గం పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తోంది. సిద్ధరామయ్య ప్రభుత్వంలో పనిచేసిన మంత్రుల్లో దాదాపు సగం మందికి ఈసారి స్థానం దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. వారి ప్లేస్‌లో కొత్తవారికి, డీకే శివకుమార్ వర్గానికి చెందిన నాయకులకు అవకాశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి జూన్ 3న జరగబోయే ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంతో కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది.
