అదే సమయంలో.. ఆన్లైన్లో చిన్నారులపై జరిగే లైంగిక వేధింపులు, చిన్నారుల అసభ్యకర కంటెంట్ (CSAM – Child Sexual Abuse Material) చలామణిపై కోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారుల డిజిటల్ స్వేచ్ఛను హరించకుండానే, వారి భద్రతను పకడ్బందీగా కాపాడేందుకు అత్యంత కఠినమైన సాంకేతిక నిబంధనలను తక్షణమే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.
ఇంటర్నెట్ బ్యాన్ చేస్తే ప్రమాదమే ఎక్కువ.. సుప్రీంకోర్టు కీలక పరిశీలనలు.
పిల్లల భద్రత పేరుతో ఇంటర్నెట్ను పూర్తిగా కట్ చేయడం సరైన పరిష్కారం కాదని ధర్మాసనం పేర్కొంది.. పిల్లల భద్రత, వారి ఇంటర్నెట్ వినియోగ స్వేచ్ఛ ఒకదానితో ఒకటి విభేదించే అంశాలు కావు. వారి రక్షణ పేరుతో డిజిటల్ ప్రపంచం నుంచి వారిని దూరం చేయడం సహేతుకం కాదు.
అండర్‌గ్రౌండ్ సైట్లకు వెళ్లే ప్రమాదం..
వయస్సు ఆధారంగా కఠినమైన ఆంక్షలు విధిస్తే, పిల్లలు నియంత్రణ లేని, మరింత ప్రమాదకరమైన డార్క్‌వెబ్ లేదా అన్‌రెగ్యులేటెడ్ వెబ్సైట్ల వైపు మళ్లే ముప్పు ఉంది.
భయంతో చెప్పుకోలేని పరిస్థితి..
ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి ఆన్‌లైన్‌లోకి వెళ్లిన పిల్లలు సైబర్ బెదిరింపులకు లేదా వేధింపులకు గురైతే.. “బ్యాన్ ఉన్నా నెట్ వాడాం కదా.. పేరెంట్స్ తిడతారేమో” అనే భయంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు లేదా పెద్దలకు చెప్పుకోలేక మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని కోర్టు హెచ్చరించింది.
సోషల్ మీడియా, నియంత్రణ సంస్థల వైఫల్యంపై అసహనం..
ఆన్లైన్లో పిల్లల లైంగిక దోపిడీ కంటెంట్ నిరంతరం వ్యాప్తి చెందడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.. నిబంధనలు ఉన్నప్పటికీ బాధితులను రక్షించడంలో నియంత్రణ సంస్థలు, సోషల్ మీడియా మధ్యవర్తిత్వ సంస్థలు (Intermediaries) చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.
రీడైరెక్ట్ లింక్‌లు, ప్రత్యేక వెబ్సైట్ల ద్వారా సోషల్ మీడియాలో చెల్లింపుల ప్రమోషన్ల (Paid Promotions) రూపంలో ఇలాంటి అసభ్యకర కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్నారన్న నివేదికలను కోర్టు తీవ్రంగా పరిగణించింది.
ప్రస్తుత వ్యవస్థ కేవలం వ్యక్తిగత ఫిర్యాదులపైనే ఆధారపడుతోందని.. ఒక ప్లాట్‌ఫామ్ ఒక కంటెంట్‌ను తొలగిస్తే, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో అది ఆటోమేటిక్‌గా బ్లాక్ కావడం లేదని, దీనివల్ల వైరల్ కంటెంట్ ఇంటర్నెట్లో తిరుగుతూనే ఉంటోందని పేర్కొంది. ఈ విషయంలో ఇకపై చూసీచూడనట్లు ఉండలేమని స్పష్టం చేసింది.
క్రాస్-ప్లాట్‌ఫామ్ డిటెక్షన్ – నేషనల్ డేటాబేస్ ఏర్పాటు..
ఈ దుర్మార్గాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో మాత్రమే అడ్డుకోగలమని పేర్కొంటూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది..
పర్సెప్చువల్ హ్యాష్ & URL డేటాబేస్..
చిన్నారుల అబ్యూస్ మెటీరియల్‌ను గుర్తించేందుకు జాతీయ స్థాయిలో ‘పర్సెప్చువల్ హ్యాష్‌లు’ (Perceptual Hashes), URL లతో కూడిన నేషనల్ డేటాబేస్‌ను రూపొందించేలా మార్గదర్శకాలు తీసుకురావాలని కేంద్రానికి ఆదేశాలు ఇచ్చింది. దీనివల్ల ఒక ప్లాట్ఫామ్లో గుర్తించిన తప్పుడు కంటెంట్ వేరే ఏ సర్వీసులో అప్లోడ్ అయినా సిస్టమ్ దాన్ని ఆటోమేటిక్‌గా గుర్తించి బ్లాక్ చేస్తుంది.
తప్పుడు తొలగింపులపై రక్షణలు (Safeguards)..
అదే సమయంలో సాధారణ కంటెంట్ పొరపాటున తొలగించబడకుండా (Wrongful Deletion) పకడ్బందీ రక్షణలు ఉండాలి. కేవలం ఒక్క ఫిర్యాదుతో మెకానికల్‌గా డేటాను తొలగించకూడదు; బహుళ అంచెల వెరిఫికేషన్ ఉండాలి.
గ్రీవెన్స్ రిడ్రెస్సల్..
పొరపాటున ఏవైనా సాధారణ ఫొటోలు లేదా యూఆర్ఎల్లు బ్లాక్ అయితే ఫిర్యాదు చేసుకునే వ్యవస్థను కల్పించాలి.
టెక్నాలజీ దుర్వినియోగం కాకూడదు..
పిల్లల అబ్యూస్ కంటెంట్ కోసం రూపొందించే ఈ హ్యాష్ డేటాబేస్‌ను ప్రభుత్వాలు ఇతర రాజకీయ లేదా సాధారణ కంటెంట్‌ను తొలగించడానికి రీ-పర్పస్ (దుర్వినియోగం) చేయకూడదని కోర్టు స్పష్టమైన గీత గీసింది.
ప్రైమరీ స్కూల్ నుంచే డిజిటల్ అవేర్నెస్..
పిల్లలను ఆన్లైన్ ప్రమాదాల నుంచి కాపాడటానికి పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించాలని న్యాయస్థానం పిలుపునిచ్చింది:
ప్రాథమిక పాఠశాల (Primary School) స్థాయి నుంచే చిన్నారులకు ఆన్లైన్ రిస్క్‌లు, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ లాంటి సైబర్ భద్రతా పాఠాలు, సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్‌లు నిర్వహించాలి.
ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు ఏదైనా బెదిరింపు లేదా అసౌకర్య పరిస్థితి ఎదురైనప్పుడు ఏమాత్రం భయపడకుండా వెంటనే పెద్దల సహాయం కోరేలా చిన్నారుల్లో ధైర్యం నింపే వాతావరణాన్ని పాఠశాలల్లో, ఇళ్లలో నిర్మించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
చిన్నారుల రాజ్యాంగబద్ధమైన స్వేచ్ఛను హరించకుండానే.. సాంకేతికత సాయంతో ఆన్లైన్ వేధింపుల నెట్‌వర్క్‌లను సమూలంగా కూకటివేళ్లతో పెకిలించడమే లక్ష్యంగా సుప్రీంకోర్టు ఈ మార్గదర్శకాలను జారీ చేసింది.