M K Stalin: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లుపై దక్షిణాది రాష్ట్రాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ గురువారం వినూత్నంగా నిరసన చేపట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లు ప్రతిని దహనం చేయడంతో పాటు, తన నివాసంపై నల్లజెండాను ఎగురవేసి రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు.
“నల్ల చట్టం” అంటూ మండిపాటు
నల్ల దుస్తులు ధరించిన స్టాలిన్, ‘రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, 2026’ను “నల్ల చట్టం”గా అభివర్ణించారు. నియోజకవర్గాల స్వరూపాన్ని మార్చే ఈ ప్రయత్నం సమాఖ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు అని ఆయన మండిపడ్డారు.
తమిళనాడు అంతటా ప్రతిఘటన వ్యాపించాలి! గతంలో హిందీ వ్యతిరేక ఉద్యమాలతో ఢిల్లీని గడగడలాడించిన చరిత్ర మనది. ఇప్పుడు కూడా అదే పట్టుదలతో ఈ అహంకారపూరిత నిర్ణయాన్ని అడ్డుకుంటాం అని స్టాలిన్ ఎక్స్ (X) వేదికగా హెచ్చరించారు.
దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే ప్రయత్నమా?
ఈ నిరసనలకు ప్రధానంగా మూడు కారణాలను డీఎంకే ప్రభుత్వం తెరపైకి తెచ్చింది:
-
జనాభా ప్రాతిపదికన అన్యాయం: 2011 జనాభా లెక్కల ఆధారంగా సీట్లను కేటాయిస్తే, జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గుతుంది.
-
రాష్ట్రాల హక్కుల ఉల్లంఘన: లోక్‌సభ స్థానాలను 543 నుండి 850కి పెంచే క్రమంలో ఉత్తరప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాలకు లాభం చేకూర్చి, దక్షిణాదిని బలహీనపరుస్తున్నారని మంత్రి అన్బిల్ మహేష్ ఆరోపించారు.
-
హడావిడి నిర్ణయాలు: రాష్ట్రాలతో చర్చించకుండా, ఎన్నికల సమయంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బిల్లులను పాస్ చేయడాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి.
ఇళ్లపై నల్లజెండాలు.. ఊరూరా నిరసనలు
ముఖ్యమంత్రి పిలుపుతో తమిళనాడు వ్యాప్తంగా డీఎంకే నేతలు, కార్యకర్తలు తమ ఇళ్లపై నల్లజెండాలను ఎగురవేస్తున్నారు. తిరుచిరాపల్లిలో మంత్రి అన్బిల్ మహేష్ నివాసం వద్ద కూడా భారీ ఎత్తున నిరసనలు మిన్నంటాయి. ఈ బిల్లు వల్ల తమిళులు తమ సొంత గడ్డపైనే ప్రాధాన్యత కోల్పోతారని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
కేంద్రం ప్లాన్ ఇదేనా?
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో (ఏప్రిల్ 16-18) కేంద్రం ఈ ప్రతిపాదనలను ముందుకు తెస్తోంది:
-
లోక్‌సభ స్థానాలను 850కి పెంచడం.
-
2027 జనాభా లెక్కలతో సంబంధం లేకుండానే రాజ్యాంగ సవరణ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం.
