Stalin: తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి ఎప్పటికీ అధికారం దక్కదని, అహంకార రాజకీయాలకు ఇక్కడ స్థానం లేదని ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కే.స్టాలిన్ స్పష్టం చేశారు. తిరువణ్ణామలై జిల్లాలో జరిగిన డీఎంకే యువజన విభాగం నార్త్ జోన్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
“ఇది తమిళనాడు. ఇక్కడ బీజేపీ ఎప్పటికీ గెలవలేదు, భవిష్యత్తులో కూడా గెలవదు. అహంకారం కలిగిన ఏ రాజకీయ పార్టీకి అయినా తమిళ ప్రజలు అవకాశం ఇవ్వరు. అలాంటి శక్తుల్ని మేము ధీటుగా ప్రతిఘటిస్తాం” అని స్టాలిన్ అన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం తమ తదుపరి లక్ష్యం తమిళనాడేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా గానీ, సంఘ్ పరివార్ గానీ తమిళనాడులో ఎప్పటికీ విజయం సాధించలేరని ఆయన తేల్చి చెప్పారు.
బీజేపీకి తమిళ ప్రజల ఆలోచన విధానం, సంస్కృతి, భాషా గౌరవం ఎప్పటికీ అర్థం కాలేదని స్టాలిన్ విమర్శించారు. “ప్రేమతో, గౌరవంతో మా వద్దకు వస్తే మేము ఆలింగనం చేసుకుంటాం. కానీ అహంకారంతో, అధికారం చూపిస్తూ వస్తే మాత్రం తలవంచే ప్రశ్నే లేదు” అని ఆయన హెచ్చరించారు. బీజేపీని నేరుగా రాజకీయంగా ఎదుర్కొని ఓడిస్తామని స్పష్టం చేశారు.
బీజేపీ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత మితవాద, విభజన శక్తులు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నాయని స్టాలిన్ ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు తియ్యని అబద్ధాలు చెబుతూ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. ఇలాంటి శక్తులతో పోరాటం చేయడం అనివార్యమని ఆయన అన్నారు.
తమిళ భాష, తమిళ ప్రజల హక్కులను కాపాడడమే కాకుండా భారతదేశ వైవిధ్యం, సమాఖ్య విలువలను రక్షించడం కూడా డీఎంకే ప్రధాన బాధ్యత అని స్టాలిన్ పేర్కొన్నారు. బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా సైద్ధాంతిక పోరాటం చేస్తున్న ఏకైక ప్రాంతీయ పార్టీ డీఎంకేనేనని ఆయన అన్నారు.
“గెలవడానికి ఇది బీహార్ కాదు… ఇది తమిళనాడు” అంటూ స్టాలిన్ వ్యాఖ్యానిస్తూ, బీజేపీకి ఇక్కడ ఎప్పటికీ రాజకీయ పునాది ఏర్పడదని మరోసారి స్పష్టం చేశారు.
