Srisailam Tragedy

Srisailam Tragedy: సత్రం గదిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య.. ఆర్థిక కష్టాలు, అనారోగ్యమే కారణమా?

Srisailam Tragedy: ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీశైలంలో అత్యంత విషాదకర ఘటన వెలుగుచూసింది. కష్టాలు తీరాలని, మనశ్శాంతి దొరుకుతుందని స్వామివారి సన్నిధికి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక వడ్డెర సత్రంలోని గదిలో చోటుచేసుకున్న ఈ ఘోరం స్థానికులను, భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

మృతులను శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన పల్లపు సుధాకర్ (ఆటో డ్రైవర్), ఆయన ముగ్గురు అక్కలు పల్లపు ఆదిలక్ష్మి, పల్లపు మల్లేశ్వరి, పల్లపు శ్రీదేవి, అలాగే అల్లుడు గోగుల మణికంఠగా పోలీసులు గుర్తించారు.
గది నుంచి దుర్వాసన రావడంతో వెలుగులోకి.. వచ్చిన విషయం..!
పోలీసులు ఇంకా స్థానికుల కథనం ప్రకారం.. సుధాకర్ కుటుంబం గత నెలలో శ్రీశైలానికి చేరుకుని వడ్డెర సత్రంలో గదిని అద్దెకు తీసుకుంది. గత మూడు రోజులుగా గది తలుపులు తీయకపోవడం, లోపలి నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన సత్రం నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా.. గదిలోని ఫ్యానుకు ఇద్దరు పురుషులు, బాత్రూమ్‌లో ముగ్గురు మహిళలు విగతజీవులుగా వేలాడుతూ కనిపించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఆత్మహత్యకు గల ప్రాథమిక కారణాలు..

సుధాకర్ గతంలో బత్తలపల్లిలో ఆటో యూనియన్ నాయకుడిగా పనిచేస్తూ సుమారు కోటి రూపాయల వరకు అప్పులు చేసినట్లు సమాచారం. అప్పుల ఒత్తిడి తట్టుకోలేక కొంతకాలం ఇబ్బందులు పడ్డారని తెలుస్తోంది. ఇంకో పక్కన ఇద్దరు అక్కలను భర్తలు వదిలేయడం, మరో అక్కకు వివాహం కాకపోవడం, పైగా శ్రీదేవి అనే మహిళ పక్షవాతంతో బాధపడుతుండటంతో కుటుంబం తీవ్ర మానసిక కుంగుబాటుకు గురైంది. వైద్యం కోసం విరూపాక్షపురం వెళ్లి, అక్కడి నుంచి శ్రీశైలం వచ్చి ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు బంధువులు చెబుతున్నారు.

దేవస్థానం అధికారుల తనిఖీ – సత్రాల నిబంధనలపై ఆగ్రహం..

ఘటనా స్థలాన్ని శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు పరిశీలించారు..
  1. సత్రం నిర్వాహకులకు నోటీసులు: క్షేత్ర నిబంధనల ప్రకారం ఏ సత్రంలోనూ భక్తులకు 48 గంటలకు మించి గదులు ఇవ్వకూడదని, కానీ నెల రోజులుగా వీరికి ఎలా రూమ్ ఇచ్చారని దేవస్థానం అధికారులు సత్రం యాజమాన్యాన్ని నిలదీశారు. నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.
  2. సమగ్ర దర్యాప్తునకు ఆదేశం: పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి విషాదం జరగడం ఎంతో బాధాకరమని, ఎంతటి కష్టాలు ఉన్నా ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదని వారు పేర్కొన్నారు. ఘటనపై పూర్తి విచారణ జరపాలని పోలీసులను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *