Seethakka

Seethakka: లేని తల్లిని గుర్తుచేసి అవమానించారు.. కంటతడి పెట్టిన స్పీకర్ ప్రసాద్

Seethakka: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల తొలిరోజే సభలో తీవ్ర భావోద్వేగపూరిత వాతావరణం నెలకొంది. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ స్థానంలో ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్‌ను, ఆయన దివంగత తల్లిని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అత్యంత అసభ్యకర పదజాలంతో దూషించారంటూ సభలో ప్రస్తావిస్తూ మంత్రి సీతక్క తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడుతూనే ఆమె కంటతడి పెట్టుకోగా, చైర్‌లో ఉన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమయ్యారు. ఈ అపూర్వ దృశ్యంతో సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో పాటు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పక్షాల ఎమ్మెల్యేలు స్పీకర్‌కు సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు.

అసలేం జరిగింది?..

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా “కాంగ్రెస్ 1000 రోజుల పాలన ఫెయిల్” అని రాసి ఉన్న నల్ల రంగు టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి చేరుకోగా, భద్రతా సిబ్బంది గేటు వద్దే అడ్డుకున్నారు. పోలీసులతో జరిగిన తీవ్ర వాగ్వాదంలో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ చైర్‌ను, ఆయన తల్లిని ప్రస్తావిస్తూ తీవ్ర అభ్యంతరకర భాషలో మాట్లాడారనే అంశం సభను కుదిపేసింది.
“లేని తల్లిని గుర్తుచేసి అవమానించారు”: మంత్రి సీతక్క ఆగ్రహం
సభలోని మహిళా సభ్యులమైన మమ్మల్ని ఎంతో ఆదరంగా చూసుకునే స్పీకర్ గారిని.. నేడు లేని ఆయన తల్లిని గుర్తుచేస్తూ ఇంత దారుణంగా మాట్లాడటం సభ్యసమాజం తలదించుకోవాల్సిన విషయం” అంటూ సీతక్క కన్నీరుమున్నీరయ్యారు. ఆమె బాధను చూసి స్పీకర్ ప్రసాద్ కుమార్ సైతం కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.
దొర అహంకారమే కారణం..
దళితుడైన గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ చైర్‌లో కూర్చోవడం చూసి బీఆర్ఎస్ అగ్రనేతలు ఓర్వలేకపోతున్నారని సీతక్క మండిపడ్డారు. “అధ్యక్షా” అని పిలవాల్సి వస్తుందనే భయంతోనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. తెలంగాణలో చెడు సంస్కృతికి, అసభ్య పదజాలానికి కేసీఆర్, ఆయన బీఆర్ఎస్సే ‘బ్రాండ్ అంబాసిడర్లు’ అని ధ్వజమెత్తారు.

తాతా మధుపై చర్యలకు సర్వపక్షాల డిమాండ్..

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో ఆధారాలను పరిశీలించి, తాతా మధు శాసనమండలి సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని, పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన నవీన్ రెడ్డిలతో పాటు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని సీతక్క డిమాండ్ చేశారు. 

కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే..

తమ పార్టీ నేతలను రెచ్చగొట్టి పంపిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యావత్ తెలంగాణ సమాజానికి, సభాపతికి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *